రాష్ట్రానికి ద్రోహం చేసిన వారుపొత్తులతో వస్తున్నారు!

Mar 11,2024 07:55 #ap cm jagan, #medarametla, #speech

– నోటాకు వచ్చిన ఓట్లు కూడా రానివారు పొత్తులు పెట్టుకుంటున్నారు

-మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి- బాపట్ల జిల్లారాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలు, ప్రజల చేతిలో చిత్తుగా ఓడిన వారు పొత్తులతో ఎన్నికల బరిలో దిగుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. నోటాకు వచ్చిన ఓట్లు కూడా రానివారు పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పొత్తుల పార్టీల్లో సైన్యాధిపతులే ఉన్నారని, సైన్యం లేదని విమర్శించారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగడం పట్ల తనదైన శైలిలో ఆ పార్టీలను విమర్శించారు. అయితే, ఎక్కడా నేరుగా బిజెపి పేరుగానీ, ప్రధాని మోడీ పేరుగానీ ప్రస్తావించలేదు. చంద్రబాబుకు ఉన్నట్లుగా తనకు పొలిటికల్‌ స్టార్స్‌ లేరన్నారు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతటి ప్రజా స్టార్స్‌ తన వైపు ఉన్నారని, వారంతా తన స్టార్‌ క్యాంపెయినర్లని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ రానుందని, బాబు అండ్‌ కో పొత్తులతో వస్తోందని అన్నారు. పొత్తుల కోసం చంద్రబాబు తన దత్తపుత్రునితో కలిసి కేంద్రం ముందు మోకరిల్లారని దుయ్యబట్టారు. తమ ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరిగి గ్రామగ్రామానా అభివృద్ధి పనులు చేపట్టారు. చంద్రబాబు కేంద్రం గడప, ఎల్లో మీడియా అధిపతుల గడపల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. 14 ఏళ్ల పాటు సిఎంగా ఉండి చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. ఇప్పుడు పొత్తులతో వస్తున్న ఈ పార్టీలు 2014లో కూడా చాలా హామీలు ఇచ్చాయని, అందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని వివరించారు. ప్యాకేజీ స్టార్‌ సైకిల్‌ సీట్లు అడగరని, చంద్రబాబు సైకిల్‌ ఎక్కమంటే ఎక్కుతారని, దిగమంటే దిగుతారని దుయ్యబట్టారు. చంద్రబాబు మేనిఫెస్టోకు శకుని పాచికలకు తేడా లేదన్నారు. అందుకే పక్క రాష్టాల నుంచి తీసుకుని చంద్రబాబు కిచిడి వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు.

త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ఎన్నికల మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తామని, చేయగలిగిందే చెబుతానని జగన్‌ వెల్లడించారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం, అక్కాచెల్లెమ్మల ముఖం మీద చిరునవ్వులు ఉండాలన్నదే తన కల అని తెలిపారు. కరువు లేకుండా వ్యవసాయాన్ని మార్చుతామని, రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎస్‌సి, ఎస్‌సి, మైనార్టీలు, బిసిలు పేదరికంలో ఉండకూడదని, పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని అన్నారు. పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాలపరంగా వేగంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ, ప్రతి పేదవాడికీ మంచి చేసినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మీ జగనన్న అధికారంలోకి మళ్లీ రావాల్సి ఉందని పేర్కొన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోయి పేదలు నష్టపోతారన్నారు. కార్యకర్తలకు తాను ఇచ్చిన పదవులు గతంలో ఏ పార్టీ ఇవ్వలేదని పేర్కొన్నారు. పార్టీలోని ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానన్నారు. రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రతి ఇంటికీ మంచి జరిగినట్లు తెలిపారు. అందుకే వై నాట్‌ 175 అని చెబుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యే, ఎంపి సీట్లు గెల్చుకుంటామని అన్నారు. ఈ సభలో మంత్రులు కాకాని గోవర్థనరెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీ నందిగం సురేష్‌, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అనీల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

➡️