పోటీ పరీక్షల్లో సమయస్ఫూర్తి ఉండాలి- ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు

Feb 15,2024 21:50 #PDF MLC KS Laxman Rao, #speech

ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) :పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు సమయస్ఫూర్తి ఉండాలని ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని త్యాగరాజ భవనంలో గ్రూప్‌, డివైఇఒ పరీక్షలపై ఉచిత అవగాహనా సదస్సును డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గేదెల ధనుష్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో భారత సమాజం పుస్తకాన్ని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రుల సామాజిక, ఆర్థిక చరిత్ర పుస్తకాన్ని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ శ్రీవాణి ఆవిష్కరించారు. ముఖ్యవక్తగా లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలకు సన్నద్ధతపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. పోటీ పరీక్షల్లో ప్రతి మార్కూ ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రశ్నల సరళిపై అవగాహనతోపాటు సమయస్ఫూర్తి ఉండాలన్నారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సుమారు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కేవలం అతికొద్ది పోస్టులు ప్రకటించడం దారుణమన్నారు. 40 ఏళ్ల చరిత్రలో ఐదేళ్లలో ఒకసారి మాత్రమే డిఎస్‌సి ప్రకటించడం ఇదే మొదటిసారని విమర్శించారు. సదస్సులో యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాసరాజు, సిఐటియు, జెవివి, యుటిఎఫ్‌, కెవిపిఎస్‌, నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️