ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తాం

We will move for special status
  • జై భారత్‌ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ 
  •  పార్టీ మ్యానిఫెస్టో విడుదల 
  • విశాఖ నుంచి పోటీ చేస్తానని వెల్లడి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడంలో వైసిపి, టిడిపి విఫలమయ్యాయని జై భారత్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు వి.వి.లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తామని, దీనిపై జై భారత్‌ పార్టీకి స్పష్టత, ఉద్యమ కార్యాచరణ ఉందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ భవనంలో బుధవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టోను ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంభిస్తోందని విమర్శించారు. మార్చి ఒకటిన విద్యార్థి, పోరాట సంఘాలు తలపెట్టిన చలో తాడేపల్లి కార్యక్రమానికి మద్దతునిస్తున్నట్టు తెలిపారు. 22 మంది ఎంపిలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లోగా తాను సాధించిందేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోరాడితే సత్ఫలితాలు వస్తాయని, అందుకు నిర్థిష్ట కార్యాచరణ అవసరమని తాము భావిస్తున్నానని తెలిపారు. చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

➡️