బాబు, మోడీ మధ్య డీల్‌ ఏమిటి?

Mar 18,2024 00:25 #nani, #YCP
  • మాజీ మంత్రి పేర్ని నాని

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బాబు, మోడీ మధ్య డీల్‌ ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని వైసిపి నాయకులు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం వైసిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుర్చీల కోసమే మోడీ, బాబు, పవన్‌ కలిశారని విమర్శించారు. మోడీని తిట్టిన నోటితోనే ఆయన్ను పొడగడం ఏమిటో చెప్పాలన్నారు. మోడీ కనికరం కోసం కాళ్లబేరానికి చంద్రబాబు వెళ్లారని అన్నారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తాజావి ఎలా అయ్యాయో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పాలని ప్రశ్నించారు. బాబు అవినీతి పరుడు అన్న మోడీ ఇప్పుడు అతని అవినీతి ఏమైందో చెప్పాలని మోడీని ప్రశ్నించారు. ఆయన చేసిన పాపాలను ఏ గంగాజలంతో కడిగారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆల్‌ ఇండియా చంద్రబాబు కమిటీలా కాంగ్రెస్‌ ఉందని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని తిట్టిన బాబు ఇప్పుడు ఎందుకు పొడిగారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కోరారు.

➡️