మహిళా హక్కుల హననం – పాలకులకు బుద్ధి చెప్పండి

Feb 22,2024 22:02 #aidwaa, #sabha

– సామాన్యులను కొట్టి కార్పొరేట్లకు రుణమాఫీ

– ఇదే మోడీ ఆర్థిక నీతి : ఐద్వా జాతీయ కార్యదర్శి థావలే

– విశాఖలో మహిళల భారీ ప్రదర్శన, బహిరంగ సభ

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :మహిళల హక్కులను హరిస్తోన్న పాలకులకు బుద్ధి చెప్పాలని ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం థావలే కోరారు. పదేళ్లుగా దేశంలో అధికారం చెలాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై ధరలు, పన్నుల భారాలను మోపడం ద్వారా నిరుద్యోగం, ఆకలిని పెంచి, అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల మేర బ్యాంకుల రుణమాఫీ చేసిందని, ఇదే మోడీ ఆర్థిక నీతి అని విమర్శించారు. ఈ నెల 22 నుంచి 25 వరకూ ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నగరంలోని సరస్వతీ పార్కు నుంచి వేలాది మంది మహిళలలో భారీ ప్రదర్శన నిర్వహించారు. డాబాగార్డెన్స్‌ మీదుగా సెంట్రల్‌ పార్క్‌ వరకూ ఈ ప్రదర్శన సాగింది. అగ్రభాగాన మరియం థావలేతో పాటు సంఘం జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి, నాయకులు వై.సత్యవతి, బి.పద్మ, డాక్టర్‌ జి.ప్రియాంక, ఆర్‌.విమల ఉన్నారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లు, మున్సిపల్‌ కార్మికులు, పలు రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ఈ ర్యాలీలో పాల్గన్నారు. సెంట్రల్‌ పార్కు వద్ద జరిగిన బహిరంగ సభలో మరియం థావలే మాట్లాడుతూ.. ప్రజలకు నష్టం చేకూర్చే విధానాలను ప్రతిఘటించకుండా కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ విచ్ఛినానికి బిజెపి పాల్పడుతోందన్నారు. జగన్‌ ప్రభుత్వం అందుకు సహకరిస్తోందని విమర్శించారు. కావున ఈ రెండు పార్టీలకూ రానున్న ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. దేశ ప్రజలకు కేవలం ఐదు కేజీల బియాన్ని పంపిణీ చేస్తూ పౌష్టికాహారం అందిస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రచారార్భాటానికి దిగడం సిగ్గుచేటన్నారు. సామాన్యులపై రవాణా భారం మోపి విమాన ఛార్జీలను తగ్గించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కోట్లమంది ప్రజలకు ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు అందించే సర్వీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కోత విధించి అంబానీ, అదానీలకు రూ.18 లక్షల కోట్ల మేర బ్యాంకుల ద్వారా రుణమాఫీ చేయడం దుర్మార్గమన్నారు. దేశమంతటా మహిళలపై దాడులు, హింస జరుగుతున్నా ప్రభుత్వం ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’, ‘భేటీ బచావో భేటీ పడావో’ వంటి శుష్క నినాదాలను వల్లెవేస్తుందన్నారు. మద్దతు ధర కావాలని రైతులు ఆందోళన చేస్తుంటే ఉక్కుపాదంతో అణచివేయడాన్ని చూస్తే ప్రజలను బిజెపి శత్రువుగా చూస్తున్నట్టు అర్థమవుతుందన్నారు. ఆంధ్రాతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆడపిల్లలు అదృశ్యమవుతున్నారంటే బాలికల సంక్షేమానికి ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో తెలుస్తోందన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ మోడీ ఆస్తి కాదు

‘మూడేళ్లుగా మీరు చేస్తున్న ఉక్కు రక్షణ పోరాటం ఆదర్శం. మహిళలు పెద్ద ఎత్తున ఆ పోరాటంలో పాల్గనడం అభినందనీయం. అద్భుతం’ అని మరియం థావలే కొనియాడారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించడానికి అది మోడీ ఆస్తి కాదని ఎద్దేవా చేశారు. అనేక విషయాల్లో మాదిరిగా ప్లాంట్‌ విషయంలోనూ మోడీకి జగన్‌ వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు.

ప్రయివేటీకరణ విధానాన్ని తిప్పికొట్టిన చరిత్ర ఉంది: పుణ్యవతి

విశాఖలో ప్రభుత్వ రంగ సంస్థలైన షిప్‌యార్డు, స్టీల్‌ప్లాంట్‌, బిహెచ్‌పివిలకు గతంలో నష్టం చేయాలని చూసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాడిన చరిత్ర ఐద్వాకు, మహిళలకు ఉందని సంఘం జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుని తీరుతామని స్పష్టం చేశారు. అమ్మడానికి, కొనడానికి విశాఖలో ఎవరైనా అడుగుపెడితే తడాఖా చూపుతామని హెచ్చరించారు. మోడీ అమ్ముతామంటే వైసిపి, టిడిపి, జనసేన చోద్యం చూస్తున్నాయంటూ మండిపడ్డారు. విశాఖపట్నం, గ్రామీణ ప్రాంతాల్లో ఐద్వా ఉద్యమ ప్రస్థానాన్ని, సాధించిన విజయాలను వివరించారు.

➡️