మాధవరం ‘ఆత్మహత్య’లపై విచారణకు ఆదేశించాలి

Mar 24,2024 21:35 #cpm paramarsa, #Kadapa

– కారకులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి
– బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి
– సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ డిమాండ్‌
ప్రజాశక్తి – వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రతినిధి :వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం చేనేత కుటుంబం ఆత్మహత్యకు కారకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ డిమాండ్‌ చేశారు. మాధవరంలో శనివారం ఆత్మహత్యకు పాల్పడిన సుబ్బారావు కుటుంబీకులను సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్‌ బృందంతో కలిసి ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గఫూర్‌ మాట్లాడుతూ 2015లో ఒంటిమిట్ట పొలం పరిధిలోని సర్వే నెంబర్‌ 218.2, ఖాతా నెంబర్‌ 1712లో 2.10 ఎకరాల పొలాన్ని ప్రభుత్వం సుబ్బారావు తండ్రి చలపతికి మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గ వైసిపి నేతల అనుచరులు అప్పటి తహశీల్దార్‌, ఆర్‌డిఒల సహకారంతో సుమారు 600 ఎకరాలపైగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తొలగించి అనర్హుల పేర్లను ఎక్కించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఇందులోని నిజానిజాలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత జిల్లాలో చోటుచేసుకున్న భూకబ్జాతో నిండు కుటుంబం బలి కావడంపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులైన అధికారులు, వైసిపి నాయకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్‌లో చోటుచేసుకునే ఇటువంటి దురాగతాలకు వైసిపి సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అండగా ఉంటాం :సిపిఎం
మాధవరంలో ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబ సభ్యులకు సిపిఎం అండగా ఉండి పోరాటం చేస్తుందని, సాధ్యమైన మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని గఫూర్‌ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తామని, విచారణకు ఆదేశించాలని కలెక్టర్‌ను కోరతామన్నారు. బాధిత కుటుంబాన్కి దక్కేలా ప్రయత్నించడంతో పాటు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం తక్షణమే అందజేయాలని కోరతామని తెలిపారు. పిఎం కిసాన్‌ నిధులు జమ దగ్గర నుంచి కుటుంబ అప్పుల అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయన వెంట సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి, అన్వేష్‌, ఒంటిమిట్ట, సిద్ధ వటం మండల కార్యదర్శులు కోనేటి నరసయ్య సురేష్‌బాబు ఉన్నారు.

➡️