మానవతావాది డాక్టర్‌ జ్యోతి

-సంస్మరణ సభలో సిపిఎం సీనియర్‌ నాయకులు మధు

ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి:ప్రజల పట్ల గౌరవ భావంతో, తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప మానవతావాది డాక్టర్‌ జ్యోతి అని మాజీ ఎంపి, సిపిఎం సీనియర్‌ నాయకులు పి.మధు కొనియాడారు. మానవతావాదాన్ని అలవరుచుకోవడమే జ్యోతికి ఇచ్చే నివాళి అన్నారు. వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ మానవత్వం మూర్తీభవించిన డాక్టర్‌ సిరివరపు జ్యోతి సంస్మరణ సభ కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో ఆదివారం జరిగింది. సమత నర్సింగ్‌ హోం వైద్యులు చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడుతూ.. జ్యోతి తల్లిదండ్రులు నాగెళ్ల రాజేశ్వరమ్మ, జానకిరామయ్యల పేరుతో ఉయ్యూరులో ట్రస్టు నిర్మించారని, దాని నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయించారని తెలిపారు. జ్యోతి ఆశయాలను నెరవేర్చేందుకు సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎంబివికె ట్రస్టు బాధ్యులు పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక భావాలున్న జ్యోతి అన్ని మతాలవారికి సాయం చేశారని తెలిపారు. ఆమె సెక్యులర్‌ దృక్పథం కలిగి ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే అన్నే విజయలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రుల బాటలోనే జ్యోతి ప్రజలకు అసాధారణ సేవలందించారని కొనియాడారు. రైౖతు సంఘం రాష్ట్ర కోశాధికారి వై.కేశవరావు మాట్లాడుతూ ప్రజాసేవలో ముందున్న రాజేశ్వరమ్మ, జానకిరామయ్య లక్షణాలను జ్యోతి పుణికిపుచ్చుకున్నారని తెలిపారు. సిపిఎం రాష్ట్ర నాయకులు కాట్రగడ్డ స్వరూపరాణి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయ సాధనకు జ్యోతి కృషి చేశారన్నారు. తొలుత నేతలు జ్యోతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహరావు, వైద్యులు నీరజ, పూర్ణచంద్రరావు, అమన్‌, సుధాకర్‌, వెంకట్‌, జానకిరామయ్య విజ్ఞాన కేంద్రం బాధ్యులు నిమ్మాది గోపాల్‌, ఎస్‌కె ఇస్మాయిల్‌, విశ్వశాంతి విద్యా సంస్థల అధినేత మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు, సిపిఎం, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️