‘మార్పు కోసం సిపిఎం’ ఇంటింటి ప్రచారం ప్రారంభం

ప్రజాశక్తి-విజయవాడ : ‘మార్పు కోసం సిపిఎం’ అనే నినాదంతో సిపిఎం సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ… వై.సి.పి, తెలుగుదేశం పాలనలో గత10 సంవత్సరాల్లో న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ ప్రాంతాలకు, నివసిస్తున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ప్రతి ఇంటి నుండి పదివేల రూపాయల వరకు పట్టాల పేర్లతో భారం మోపారన్నారు. శాసనసభ్యులు మారారు కానీ పట్టాలు మాత్రం దక్కలేదని మండిపడ్డారు. ఒక్క సంతకం ముక్క, ఒక జీవోతో పట్టాలు వచ్చే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే పేదలకు పట్టాలు ఇవ్వకుండా తొక్కిపెట్టారని ఆగ్రహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పట్టాల పేరుతో ఊరించడమే తప్ప, పేదలకు ఇచ్చింది లేదన్నారు. పట్టాలు ఇవ్వటానికి తెలుగుదేశం, వై.సీ.పీ శాసనసభ్యులకు ఏమి అడ్డం వచ్చింది? ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అజిత్ సింగ్ నగర్ నుండి కండ్రిక వరకు ఉన్న అన్ని కాలనీల్లో 40వేల మందికి కమ్యూనిస్టులు నగరపాలక సంస్థలో అధికారంలో ఉండగా, బాబూరావు కార్పొరేటర్ గా ఉండగా గజం రూపాయిన్నర నుండి 15 రూపాయల లోపు నామమాత్రపు ధరలకే రిజిస్ట్రేషన్ చేయించి, పట్టాలు ఇచ్చిన ఘనత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేతిలో ఉన్నా, ఎందుకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. అర్హత కలిగిన వారందరికీ ఇళ్ళు ఇస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మించి మోసం చేశాయని పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం, నేడు వై.సి.పి. ధగా చేశారని, ఇళ్ళ పేరుతో ప్రభుత్వము, నేతలు డబ్బు గుంజేసారు కానీ ఇళ్ళు దక్కలేదన్నారు. భూకబ్జాలలో మాత్రం పాలక పార్టీ నేతలు మునిగి తేలుతున్నారన్నారు. స్వాతంత్ర సమరయోధుల భూములను మింగిన చరిత్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. బుడమేరు, ఇరిగేషన్ భూములను కబ్జా చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. డిస్నీల్యాండ్ లో 57ఎకరాల స్థలాన్ని కబేళా పేరుతో బడా కంపెనీలకు కట్ట బెట్టి, పేదవారికి మొండి చేయి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను నగరానికి దూరంగా తరిమేయటానికి కుట్ర పన్నుతున్నారని, గతంలోనూ, నేడు పనిచేసిన శాసనసభ్యుల నిర్లక్ష్యం, అసమర్థత వలనే పేదలకు ఇళ్ల స్థలాలు దక్కలేదన్నారు. ఇళ్ళు నిర్మాణాలు సాగలేదని, మళ్లీ వీరికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. కాలువ కట్టల పైన, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఇళ్ళు తొలగించిన సందర్భాల్లో ప్రత్యామ్నాయ స్థలాల కోసం పోరాడింది కమ్యూనిస్టులు మాత్రమేనని తెలిపారు. చెత్తపన్ను, విద్యుత్ చార్జీలు, పంటగ్యాస్ ధరలు, నిత్యావసర ధరలతో ప్రజలు కృంగిపోతున్నారని అన్నారు. పాలకులపై పేదలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. జగన్, మోడీ ఉమ్మడిగా ప్రజలను పీల్చి పిప్పి చేశారన్నారు. పేదలపై భారాల మోపిన మోడీ, బీజేపీతో తెలుగుదేశం జతకడుతోందని, ధరలు, పన్నుల భారాల పాపంలో టిడిపి భాగస్వాములు అవుతున్నారు. మోడీ, బి.జె.పిని బలపరుస్తూ .. భారాలు తగ్గిస్తామని తెలుగుదేశం నేతలు మాట్లాడటం మోసపూరితమన్నారు. శాసనసభకు కమ్యూనిస్టులను పంపాలని, సెంట్రల్ నుండి సి.పి.ఎం ను ఎన్నుకోవాలని కోరారు. నగర ప్రజల వాణి విడిపించే అవకాశం కల్పించాలని కోరారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు బి.రమణరావు, ఇ.వి నారాయణ, టి.శ్రీనివాస్, రాము, ప్రసాద్, ఎంవి. రమణ, నాగరాజు, నిజాముద్దీన్, దుర్గాప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️