రైతులపై మోడీ కర్కశత్వం

Feb 24,2024 08:29 #formers, #nirasana

– యువరైతు మృతికి బాధ్యత వహించాలి

– రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ప్రజాశక్తి – యంత్రాంగం :ఢిల్లీలో రైతుల ఆందోళనపై పోలీసులు జరిపిన రబ్బరు బుల్లెట్‌ కాల్పుల్లో మరణించిన యువరైతు శుభకరణ్‌సింగ్‌ మృతికి కారుకులైన వారిని శిక్షించాలని, ఎంఎస్‌.సామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ వామపక్ష, రైతు సంఘాల ఆధ్వర్యాన శుక్రవారం బ్లాక్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనలు, ధర్నాలు చేపట్టారు. మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. రైతుల సమస్య పరిష్కారానికి చొరవ చూపకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఐద్వా కేంద్ర కమిటీ ఆధ్వర్యాన విశాఖ డాబాగార్డెన్స్‌లో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మోడీ, అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు పికె. శ్రీమతి, మరియం థావలే తదితరులు పాల్గన్నారు.అంతకుముందు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బ్లాక్‌ డే నిర్వహించారు. అనకాపల్లిలో నాలుగు రోడ్ల కూడలి అంబేద్కర్‌ విగ్రహం వద్ద, నర్సీపట్నంలో నిరసన తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణం మడకశిరలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతుల పోరాటంపై బిజెపి ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవరిస్తోందన్నారు. యువ రైతు మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రం అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మృతి చెందిన రైతు చిత్రపటానికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభించే బిజెపిని, దానిని బలపరిచే పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని కోరారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు మాట్లాడుతూ.. మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఉద్యమం సాగించవలసిన పరిస్థితి దాపురించిందన్నారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.పోలారి, ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌ వెంకటసుబ్బయ్య, ఎఐసిసిటియు రాష్ట్ర అధ్యక్షులు సుధీర్‌ తదితరులు పాల్గన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద, మందసలో రాధాకృష్ణాపురం రైస్‌ మిల్లుల కూడలి వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, విజయనగరం జిల్లాల్లో ధర్నాలు జరిగాయి.

➡️