ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే నాయకుడిని ఎన్నుకుందాం

Mar 8,2024 20:55 #nara bhuvaneswari, #speech

– ‘మీ ఓటు మీ భవిష్యత్తు’ కార్యక్రమంలో భువనేశ్వరి

పత్తికొండ,ప్రజాశక్తి (కర్నూలు జిల్లా) :ఉద్యోగ అవకాశాలు సృష్టించి, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం మనందరి బాధ్యతని నారా భువనేశ్వరి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ గోపాలప్లాజాలో మీ ఓటు మీ భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘కలలకు రెక్కలు’ పథకం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్‌ కోర్సులు నేర్చుకునే విద్యార్థినులకు ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంకు రుణాలు, బ్యాంకు నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా కొత్త కార్యక్రమాన్ని భువనేశ్వరి ప్రకటించారు. టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికలు మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధమని అన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పారదర్శకత లేని, అభివృద్ధి, సంక్షేమం ఇవ్వని నేతలను ప్రజలు ఎన్నుకున్నారన్నారు. దీంతో రాష్ట్రం చాలా నష్టపోయిందని తెలిపారు. మీ ఓటు మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని చెప్పారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. ఇప్పటి నాయకులు సమాజాన్ని విభజించి పాలించడమే ధ్యేయంగా చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమించేవారని తెలిపారు. ఈ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే… 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడ బిడ్డకు నెలకు రూ.1,500, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి కోసం ఏడాదికి రూ.15,000 వేల సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

➡️