విశాఖ ఉక్కుకు కేంద్రం తూట్లు – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Dec 10,2023 08:24 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ నడవడికకు అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1031వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ ఎస్‌ఎంఎస్‌ 1 కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురికాకతప్పదన్నారు. ప్లాంట్‌ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి నష్టాలు దిశగా నెట్టింది కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు. అందుకు సహకరిస్తున్న రాజకీయ పార్టీల నేతలు చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. లాభాల బాటలో ఉన్న పరిశ్రమను కేంద్రం ఎలా నష్టాల్లోకి నెట్టిందీ వివరించారు. ఐదు లక్షల మందికి జీవనాధారమైన స్టీల్‌ప్లాంట్‌ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర పాలకులు చోద్యం చూస్తున్నారని అన్నారు. కొత్త పరిశ్రమలు తీసుకొస్తామని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయని, ఉన్న పరిశ్రమను కాపాడలేని వీరి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. దీక్షల్లో పోరాట కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్‌, కారు రమణ, రాజబాబు, ఎంవి.రమణ, సుబ్బయ్య, సిహెచ్‌.కల్యాణ్‌, పివి.రమణమూర్తి, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

➡️