శ్రీనుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి- కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి

Feb 12,2024 08:09 #KVPS, #speech

ప్రజాశక్తి -ముమ్మిడివరం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) :జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విశాఖ సెంట్రల్‌ జైల్‌ నుంచి కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఇంటికి చేరుకున్న శ్రీనివాసరావును ఆయన ఆదివారం పరామర్శించారు. బాధితునికి, ఆయన కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. చట్టాల అమల్లో నిర్లక్ష్య వైఖరి కారణంగా శ్రీను ఆరేళ్లు జైలులోనే గడపాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కేసులో ముఖ్యమంత్రి కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల ఇన్నేళ్లు జైలులోనే మగ్గాల్సి వచ్చిందన్నారు. పౌరహక్కుల నేతలు, హైకోర్టు న్యాయవాది సలీం, దళిత సంఘాలు శ్రీనుకు అండగా ఉండడం అభినందనీయమన్నారు. జైల్లో శ్రీను డిగ్రీ పూర్తి చేయడం, పుస్తకాలను అధ్యయనం చేయడం అభినందనీయమన్నారు. విచారణ లేకుండా దీర్ఘకాలం రిమాండ్‌లో మగ్గిన శ్రీనుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. నేటి మనువాద మతోన్మాదుల పాలనలో ఎస్‌సి, ఎస్‌టిల రక్షణ కోసం ఉన్న చట్టాలు నిర్వీర్యమవుతున్నాయని తెలిపారు. విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చర్చకు రావట్లేదని చెప్పారు. సమావేశాలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఆయన వెంట జిల్లా నాయకులు గుదే దుర్గాప్రసాద్‌, శెట్టిబత్తుల తులసీరావు, యలమంచిలి బాలరాజు, శరత్‌ తదితరులు ఉన్నారు.

➡️