సజీవ జ్ఞాపకాల పందిరి ఫొటోగ్రఫీ – ఎఎన్‌యు ఉపకులపతి పి రాజశేఖర్‌

ప్రజాశక్తి ఎఎన్‌యు (గుంటూరు జిల్లా):మన కళ్ల ముందు ఎన్నో జ్ఞాపకాలను సజీవంగా ఉంచేదే ఫొటోగ్రఫీ అని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ (ఎఎన్‌యు) ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ అన్నారు. విశ్వవిద్యాలయంలోని ఫొటోగ్రఫీ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు తీసిన ఫొటోలతో యూనివర్సిటీలో శనివారం ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. దీనిని రాజశేఖర్‌ ప్రారంభించి మాట్లాడారు. విభిన్న అభిరుచి గల రంగం ఫొటోగ్రఫీ అని అన్నారు. ఏ స్థాయిలో వారైనా ఫొటోలకు ఫిదా అవుతారని తెలిపారు. విద్యార్థులే చిత్రకారులుగా వివిధ ప్రదేశాలలో ఫొటోలు తీసి వాటిని ప్రదర్శించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతకు ఫొటోగ్రఫీ ఒక వేదిక అవుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదని పేర్కొన్నారు. విద్యార్థులు రూపొందించిన చిత్రాలను తిలకించిన ఆయన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య సిహెచ్‌.స్వరూపారాణి, ఫొటోగ్రఫీ విభాగం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.అనిత, అధ్యాపకులు డాక్టర్‌ జ్యోతిర్మయి, డాక్టర్‌ జె.మధుబాబు, ఫొటోగ్రఫీ అధ్యాపకులు శ్రీనివాసరెడ్డి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️