సరకు రవాణాలో మూడవ స్థానం

Jan 3,2024 21:33 #port chairman, #press meet

– 137 మిలియన్‌ టన్నుల సామర్థ్యం… రూ.2,300 కోట్ల ఆదాయం

– అదానీ బెర్త్‌ని స్వాధీన పరచుకుని 2023లో రూ.70 కోట్ల వ్యాపారం

-వైజాగ్‌ పోర్టు ట్రస్ట్‌ ఛైర్మన్‌ ఎం.అంగముత్తు వెల్లడి

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :దేశంలోని 12 మేజర్‌ పోర్టుల సరకు రవాణా వ్యాపారంలో విశాఖ పోర్టు మూడవ స్థానంలో నిలదొక్కుకుని పురోగతి సాధిస్తోందని వైజాగ్‌ పోర్టు ట్రస్ట్‌ అథారిటీ (విపిఎ) చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు వెల్లడించారు. 1933లో విశాఖ పోర్టు మూడు బెర్తులతో ఎడ్లబండ్లపై కార్గోని తీసుకొచ్చి ఏడాదికి 1.2 లక్షల టన్నుల సరకు రవాణా చేసే స్థాయి నుంచి 2024 నాటికి 31 బెర్తులతో 137 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఈ 90 ఏళ్లలో రూ.2,300 కోట్ల రెవెన్యూ తీసుకువచ్చే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిందని తెలిపారు. నగరంలోని పోర్టు హార్బర్‌ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పోర్టు సాధించిన అభివృద్ధిని వివరించారు. ప్రస్తుతం వైజాగ్‌ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా 43 శాతం, రైల్వేల ద్వారా 26 శాతం, పైప్‌లైన్‌ ద్వారా 21శాతం, కన్వేయర్ల ద్వారా 10 శాతం సరకు రవాణా జరుగుతోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐఎఫ్‌ఎక్స్‌-2 అనే నూతన కంటైనర్‌ లైనర్‌ సర్వీసు అందుబాటులోకి రానుందని తెలిపారు. చెన్నై-సింగపూర్‌ క్రూయిజ్‌ షిప్‌ను విశాఖ నగరం మీదుగా నడిపేందుకు లిట్టోరల్‌ క్రూయిజ్‌ లిమిటెడ్‌ సంస్థతో ఎంఒయు చేసుకున్నామని చెప్పారు. సుమారు రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్‌, శ్రీలంక, మాల్దీవులకు క్రూయిజ్‌ సర్వీసులను నిర్వహించే ప్రణాళిక ఈ సంస్థకు ఉందన్నారు. పోర్టుల్లో చాలా బెర్తులు నిరుపయోగంగా, పాతవి ఉన్నందున వాటి అభివృద్ధికి పిపిపి విధానం తీసుకున్నామని చెప్పారు. డబ్ల్యుక్యు 7, 8 బెర్తుల యాంత్రీకరణ, డబ్ల్యుక్యు 6 కూడా యాంత్రీకరణ జరుగుతోందని వివరించారు. మరో ఇక్యు 6 బెర్తు పిపిపి విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. 2030 నాటికి పిపిపి టర్మినల్స్‌ ద్వారానే మొత్తం సరకులో 75 శాతాన్ని నిర్వహించడానికి ప్రణాళికలు వేశామని, పూర్తిగా ల్యాండ్‌ లార్డ్‌ పోర్టుగా వైజాగ్‌ మారనుందని వివరించారు. గతేడాది అదాని బోర్త్‌ను స్వాధీనం చేసుకుని రూ.70 కోట్ల ఆదాయం ఆర్జించామని తెలిపారు. 2022-23 సంవత్సరంలో మెరైన్‌ ఉత్పత్తుల్లో 26.36 శాతం వాటాను కలిగి ఉందని రూ.16,877 కోట్ల విలువైన 2.64 లక్షల మిలియన్‌ టన్నుల మెరైన్‌ ఉత్పత్తులను ఎగుమతి చేశామని చెప్పారు. ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునీకరణ పనులకు రూ.150 కోట్లతో పిఎంఎంఎస్‌వై కింద పనులు చేపట్టామన్నారు. పోర్టు నుంచి 16వ నెంబరు జాతీయ రహదారి వరకూ ఆటంకం లేని రవాణా కోసం రూ.501.65 కోట్లతో విశాఖ పోర్టు, ఎన్‌హెచ్‌ఎఐ సంయుక్తంగా కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌ వరకూ ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రోడ్డును 10 లైన్లకు పెంచే నిర్ణయం చేశామని, 24 నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. రూ.15 కోట్లతో పోర్టుకు చెందిన 186 ఎకరాల్లో మొక్కల అభివృద్ధికి, సుందరీకరణకు పోర్టు నిధులు వెచ్చించిందన్నారు. ఈ సమావేశంలో పోర్టు సెక్రటరీ వేణుగోపాల్‌, ట్రాఫిక్‌ మేనేజర్‌ రత్నశేఖర్‌ పలువురు హెచ్‌ఒడిలు పాల్గొన్నారు.

➡️