సింగిల్‌గా పోటీ చేసి అత్యధిక స్థానాలు సాధిస్తాం : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అనంతపురం : ఈ ఎన్నికల్లో సింగిల్‌ గా పోటీ చేసి, అత్యధిక స్థానాలు సాధిస్తామని రీజనల్‌ కోఆర్డినేటర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. కులమతాలు, పార్టీలు చూడకుండా సీఎం జగన్‌ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేశారని అన్నారు.

గతంలో లాగా జన్మభూమి కమిటీలు పెట్టీ ప్రజలను దోచుకున్న పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి అభివఅద్ధి జరిగిందా..? అని ప్రశ్నించారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న వ్యక్తి టీడీపీ హయాంలో ఏమి అభివృద్ధి చేశారు ? అని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడు, అందుకే వివిధ పార్టీలను ఊదకట్టెలు లాగా తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, ఒక్క పథకమైన గుర్తుపెట్టుకునేలా చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. సూపర్‌ సిక్స్‌ అనే పథకాలతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు హామీలు నెరవేర్చాలి అంటే అదనంగా రాష్ట్రానికి 2.5 లక్షల కోట్లు అవసరం అని అన్నారు. అది సాధ్యం కాదని, సీఎం వైఎస్‌ జగన్‌ గణాంకాలతో సహా అసెంబ్లీలో చూపించారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

➡️