సుప్రీం మార్గదర్శకాలు పాటించరా?

Feb 21,2024 08:38 #adjourned, #AP High Court

– ఎస్‌జిటి పోస్టులపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

ప్రజాశక్తి-అమరావతి: స్పెషల్‌ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జిటి) పోస్టులకు బిఇడి అభ్యర్థులను అనుమతించిన ప్రభుత్వ తీరుపై హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఈ చర్య సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం కాదా? విద్యా విధానంలో మార్పు పేరుతో చిన్న పిల్లలపై ప్రయోగాలు చేయడమే అవుతుంది కాదా? ఈ చర్యను ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుది? అని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ఎజి ఎస్‌ శ్రీరామ్‌ కల్పించుకుని కౌంటర్‌ వేసేందుకు గడువు కావాలని కోరడంతో విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలిచ్చింది. ఎస్‌జిటి పోస్టులకు బిఇడి అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ గుంటూరు జిల్లాకు చెందిన బూక్యా గోవర్ధన్‌ సాయి నాయక్‌, సహా ఐదుగురు, ప్రకాశం జిల్లాకు చెందిన బల్లా సురేష్‌ సహా ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యాలను మంగళవారం బెంచ్‌ విచారణ జరిపింది. సీనియర్‌ న్యాయవాది బి ఆదినారాయణరావు, న్యాయవాది జడా శ్రవణ్‌ కుమార్‌ వాదిస్తూ.. ఎస్‌జిటి పోస్టులకు బిఇడి అభ్యర్థులను అనుమతించడం విద్యా హక్కు చట్ట నిబంధనలకు తిలోదకాలివ్వడమేనని అన్నారు. ఆ పోస్టులకు డిఇడి అభ్యర్థులు మాత్రమే అర్హులని, సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ప్రభుత్వ విధానం ఉందన్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సిటిఇ) గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకమన్నారు. దీనిపై ఎజి స్పందిస్తూ.. రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు తెచ్చామన్నారు. ఎంపికైన టీచర్లు ఎన్‌సిటిఇ నిర్వహించే ఆరు నెలల బ్రిడ్జ్‌ కోర్సులో అర్హత సాధించాలనే నిబంధన కూడా ఉందన్నారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ తర్వాత కూడా ప్రభుత్వం ఆ విధమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటుందో బుధవారం జరిగే విచారణలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

➡️