స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం : సిఐటియు

Dec 24,2023 08:55 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్య పోరాటాలతో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, స్టీల్‌ ఒబిసి అసోసియేషన్‌ అధ్యక్షులు బి.అప్పారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1045వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ఒబిసి అసోసియేషన్‌ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు పోరాటం చేస్తుంటే దొడ్డిదారిన జిందాల్‌ కంపెనీతో యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం సరికాదన్నారు. విశాఖ ఉక్కు వంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థను ప్రయివేటుపరం చేయాలని బిజెపి ప్రభుత్వం చూడటం దుర్మార్గమన్నారు. బిజెపి అధికారం చేపట్టి ఇన్నేళ్లయినా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థనూ ఏర్పాటు చేయలేదని తెలిపారు. అలాంటిది ఉన్న పరిశ్రమను అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ తన తీరు మార్చుకుని స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, పూర్తి ఉత్పత్తి సామర్థ్యంలో నడపాలని కోరారు.

➡️