18న గ్రూప్‌-2 అవగాహనా సదస్సు

– పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి-గుంటూరు:గ్రూప్‌-2 పరీక్ష రాసే అభ్యర్ధుల కోసం గుంటూరు జిల్లా ఎసి కాలేజి ఆడిటోరియంలో ఈ నెల 18వ తేదీ ఉదయం పది గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. స్థానిక బ్రాడీపేటలోని డివైఎఫ్‌ఐ కార్యాలయంలో డివైఎఫ్‌ఐ నాయకులతో కలిసి సదస్సు పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 25వ తేదీన ఎపిపిఎస్‌సి నిర్వహిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలపై అవగాహనకు డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రిలిమినరీ, మెయిన్స్‌ సిలబస్‌, పరీక్షకి ప్రిపేర్‌ అయ్యే విధానం, ప్రామాణిక పుస్తకాలు తదితర అంశాలు వివరిస్తామన్నారు. హాజరైన అభ్యర్థులందరికీ ‘భారత సమాజం’, ‘ఆంధ్రుల చరిత్రా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ’ అనే రెండు పుస్తకాలను ఉచితంగా అందజేస్తామన్నారు. అభ్యర్థులందరూ ఈ సదస్సును వినియోగించుకోవాలని కోరారు. డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ వై కృష్ణకాంత్‌ మాట్లాడుతూ తమ సంఘం నిరుద్యోగుల సమస్యలపై పోరాడడమే కాకుండా, వారు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఇటువంటి సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. వివరాలకు 9490099992, 9705747318 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్‌, నాయకులు రూపస్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️