ఫార్మా సిటీలో ప్రమాదాలు

-వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కార్మికులు మృతి, ఐదుగురికి అస్వస్థత
ప్రజాశక్తి- పరవాడ (అనకాపల్లి):అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ర్యాంకీ ఫార్మా సిటీలోని వేర్వేరు కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. పరవాడ పోలీసుల కథనం ప్రకారం… ఫార్మా సిటీలోని ఎపిటోరియా ఫార్మా కంపెనీ యూనిట్‌-4లో ఆదివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో రియాక్టర్‌ మ్యాన్‌హోల్‌ పేలింది. అది ఎగిరి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆళ్ల గోవింద్‌ (30)కు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందినవారు. ఆరు నెలల నుంచి ఈ కంపెనీలో ఫిట్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గోవింద్‌కు తల్లిదండ్రులు, అన్న, చెల్లి ఉన్నారు. మృతదేహాన్ని విశాఖ కెజిహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఫార్మా సిటీలోనే అల్కలీ మెటల్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌-3లో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మిథైల్‌ నైట్రేట్‌ కెమికల్‌ లీక్‌ అవడంతో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిలో చందక రమణ (33) తీవ్ర అవస్థతకు లోనయ్యారు. అనకాపల్లిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గొల్లపేట గ్రామానికి చెందిన రమణకు భార్య, పాప, బాబు ఉన్నారు. ఆయన 12 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో సెక్షన్‌ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రమణతో పాటు అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు కార్మికులు విశాఖలోని కిమ్స్‌ ఐకాన్‌లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒక కార్మికుని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో నలుగురు కార్మికులు అనకాపల్లిలోని శ్రీరామ హాస్పిటల్‌లో వైద్యం పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఘటనా స్థలాలను ఫార్మాసిటీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ సందర్శించి ప్రమాదాలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫార్మా సిటీలోని కార్మికుల ప్రాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయని, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తెలిపారు.
యాజమాన్యాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి : సిపిఎం, సిఐటియు
ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి యాజమాన్యాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సిపిఎం, సిఐటియు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశాయి. మరణించిన కార్మికుల కుటుంబాలకుకోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం కోరారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఫార్మా సిటీలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకరరావు, జి.కోటేశ్వరరావు తెలిపారు.

➡️