2 నుంచి ‘ఫ్రమ్‌ది డెస్క్‌ ఆఫ్‌ది ప్రిన్సిపల్‌ సెక్రటరీ’ 

Mar 28,2024 08:34 #AP Education, #Praveen Prakash

పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థుల్లో ప్రతిరోజూ చదువుకునే అలవాటు పెంపొందించడం, విద్యలో వారి సామర్ధ్యం, ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలపడం, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ టివిల వినియోగం, పనితీరు లక్ష్యంగా ‘ఫ్రమ్‌ది డెస్క్‌ ఆఫ్‌ది ప్రిన్సిపల్‌ సెక్రటరీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు. ఏప్రిల్‌ రెండు నుంచి కొత్త తరహాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం పూర్తి సంభాషాత్మకంగా ఉంటుందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు బోధన, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌లు, స్మార్ట్‌ టివిల ద్వారా వివిధ తరగతుల విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని వెల్లడించారు. కార్యక్రమం అనంతరం ప్రశ్నలు అడిగేందుకు వీలుగా ఫోన్‌ అందుబాటులో ఉంటుందన్నారు. వాట్సాప్‌ ద్వారా ప్రశ్నలు పంపేందుకు విద్యాశాఖ బోధన, బోధనేతర సిబ్బందికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్‌ నుంచి 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు తుది పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్‌ పూర్తి, విద్యార్థుల నోట్స్‌లను సరిచేయడం వంటి అంశాలు పరిశీలిస్తామన్నారు. ఏప్రిల్‌ 23వ తేదీతో పరీక్షలు పూర్తవుతాయని, అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి రిపోర్ట్‌ కార్డులను అందించాలని తెలిపారు. విద్యాశాఖ ఛానెల్‌, ఐఎఫ్‌పిలు, స్మార్ట్‌ టివిల ద్వారా ప్రత్యక్షంగా వారితో చర్చిస్తామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో అవగాహన పెంచేందుకు యునైటెడ్‌ స్టేట్స్‌లోని ప్రిన్స్‌టన్‌లో వారం రోజులపాటు జరిగే కార్యక్రమం కోసం ప్రత్యేకంగా గుర్తించిన ప్రాథమిక, ఉన్నత పాఠశాలల నుంచి జిల్లాకు ఇద్దరు చొప్పున టోఫెల్‌ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తామన్నారు.

➡️