22వ తేది ‘జగనన్నకు చెబుదాం’

Jan 21,2024 07:58 #Anganwadi worker, #Arrests
  • కోటి సంతకాలతో రాజధానికి అంగన్‌వాడీలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:సమస్యలు పరిష్కరించాలని కోటి సంతకాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేయడానికి అంగన్‌వాడీలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సోమవారం (22వ తేది) ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సంతకాలు సేకరించిన అంగన్‌వాడీలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్ల అంగన్‌వాడీ సంఘాల నేతలు బేబీరాణి, జ్యోతి, లక్ష్మి తదితరులు మీడియాకు తెలిపారు. రోజుల తరబడి సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి అవలంబించడంతో తమ డిమాండ్లకు మద్దతుగా కోటి సంతకాలు సేకరించాలని అంగన్‌వాడీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కారక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విశేష స్పందన లభించింది. అనేకచోట్ల ప్రజానీకం అంగన్‌వాడీలు నిర్వహిస్తున్న దీక్షా శిబిరాల వద్దకు వచ్చి స్వఛ్చందంగా సంతకాలు చేశారు. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ సంతకాల సేకరణ కొనసాగింది. కోటి సంతకాలు పూర్తయిన తరువాత ముఖ్యమంత్రికి వాటిని అందచేస్తామని గతంలోనే అంగన్‌వాడీ సంఘాలు ప్రకటించాయి. ప్రజానీకంనుండి వచ్చిన అనూహ్య స్పందనతో అనుకున్నదానికన్నా త్వరగానే సంతకాల సేకరణ పూర్తయింది. దీంతో వాటిని, సిఎంకు అందించడానికి అంగన్‌వాడీలు తరలివస్తున్నారు.

సుబ్బరావమ్మ, గజలక్ష్మీల అరెస్ట్‌

-ఆస్పత్రికి తరలింపు

-సమస్యల పరిష్కారంకోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, రాష్ట్ర నాయకులు గజలక్ష్మిని పోలీసులు దీక్షా శిబిరంలోనే బలవంతంగా అరెస్ట్‌ చేశారు. అంతకుముందు వారిని పరీక్షించిన వైద్యులు వారి సుగర్‌లెవల్స్‌ తగ్గుతున్నట్లు చెప్పారు. కె.సుబ్బరావమ్మ సుగర్‌లెవల్స్‌ 54కు పడిపోయింది. అలాగే గజలక్ష్మికి 63కు పడిపోయింది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్షను విరమించాలంటూ చేసిన సూచనను వారు తిరస్కరించారు. ప్రభుత్వం స్పందించేంతవరకు నిరవధిక దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు దీంతో శనివారం సాయంత్రం ఆరుగంటల నుండి ధర్నాచౌక్‌లోని దీక్షా శిబిరం వద్ద పోలీసులు మోహరించారు. నాయకులను అరెస్టు చేస్తారనే సమాచారంతో పలు కార్మిక సంఘాల నాయకులూ అక్కడకు చేరుకున్నారు.

రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో దీక్షా శిబిరంలోకి ప్రవేశించిన పోలీసులు సుబ్బరావమ్మ, గజలక్ష్మీను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలను వారు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. దీక్షా శిబిరంలో ఉన్న అంగన్‌వాడీలు కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో శిబిరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఈ గందరగోళం మధ్యనే వారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీక్షలో ఉన్న మిగిలిన 12 మంది పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీక్షకు దిగిన మరో ఇద్దరుసుబ్బరావమ్మ, గజలక్ష్మిని అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించిన నేపధ్యంలో వారి స్థానంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు చంద్రావతి (బిఆర్‌ అంబేద్కర్‌ అమలాపురం జిల్లా), , స్వర్ణలత (ఎన్‌టిఆర్‌ జిల్లా) నిరవధిక నిరాహారదీక్షకు దిగారు.

సిపిఎం, సిఐటియు నేతలపరామర్శ

అరెస్టయి ఆస్పత్రిలో ఉన్న అంగన్‌వాడీ నాయకులు సుబ్బరావమ్మ, గజలక్ష్మిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు వరలక్ష్మి పరమార్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. దీక్షలో ఉన్న మహిళల ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీలతో చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉందని, ఎవరైనా నిరసనలకు దిగితే చర్చించి వారి సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం తీరు అందుకు విరుద్ధంగా ఉందని, పైగా ఎదురుదాడికి దిగుతోందని అన్నారు. నిరవధిక నిరాహారదీక్ష చేపడితే న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నిస్సిగ్గుగా అరెస్టులు చేయిస్తోంది తప్ప పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదని, ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే మహిళలే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు.

ప్రభుత్వానిది మూర్ఖత్వం

-ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి

అంగన్‌వాడీ మహిళల సమస్యలు పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం నిరాహారదీక్షలో ఉన్న నాయకులు సుబ్బరావమ్మ తదితరులను అరెస్టు చేయడం మూర్ఖత్వమని, చేతగానితనానికి నిదర్శనమని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి విమర్శించారు. ఇచ్చిన హామీని సిఎం నిలబెట్టుకోవాలని కోరారు. వారేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఇచ్చిన హామీని నెరవేర్చమని మాత్రమే కోరుతున్నా ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సామాజిక న్యాయం అంటూ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్‌ దళిత, పేద, ఒంటరి మహిళలకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలకు ఐద్వా సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

➡️