బిజెపికి 6 ఎంపి, 10 ఎమ్మెల్యే స్థానాలు – జనసేనకు కోత

Mar 12,2024 09:16 #BJP, #Jana Sena, #seats
  • బాబు నివాసంలో కుదిరిన ఒప్పందం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా సాధించని బిజెపి తాజా ఎన్నికల్లో ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో సోమవారం జరిగిన మూడు పార్టీల నేతల కీలక భేటీలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో చంద్రబాబునాయుడుతో పాటు, కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌, బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు జైజయంత్‌ పాండా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది. బిజెపి నాయకులు తాము అడిగిన సీట్లను ఇచ్చి తీరాల్సిందేనని పట్టు పట్టినట్లు సమాచారం. బేరసారాలకు పెద్దగా అవకాశం లేకపోవడంతో ఆ సీట్లను ఎలా సర్దుబాటు చేయాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది. చివరకు జనసేనకు ఇప్పటికే ప్రకటించిన సీట్లలో భారీ కోత పడింది. దీంతో ఒక ఎంపి స్థానంతోపాటు, మూడు అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ వదులుకోవాల్సివచ్చింది. గతంలో జనసేనకు 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ సీట్లను టిడిపి కేటాయించిన సంగతి తెలిసిందే. బిజెపికి సర్దుబాటు చేయాల్సిరావడంతో తాజాగా 21 అసెంబ్లీ, 2 ఎంపి స్థానాలకు జనసేన పరిమితమైంది. తొలుత ప్రకటించిన సీట్లపైనే జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. తాజాగా మరిన్ని సీట్లలో కోత పెట్టడంతో ఎలా స్పందిస్తారో చూడాల్సిఉంది. తాజా ఒప్పందం ప్రకారం తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు టిడిపి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఏయే స్థానాలను ఏ పార్టీలకు కేటాయించారన్న దానిపై స్పష్టత రాలేదు. దానికి సంబంధించిన కసరత్తు ఇంకా జరుగుతోందని ఆ ప్రకటనలో తెలిపారు. చర్చల ప్రక్రియ జరుగుతుండగానే నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌ పోటీ చేస్తారని పవన్‌ కళ్యాణ్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో మొత్తం 100 స్థానాలకు బిజెపి కూటమి రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

➡️