6వరోజు పారిశుధ్య కార్మికుల సమ్మె : గుంటూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

నరసరావుపేట (గుంటూరు) : గుంటూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ … గత ఐదు రోజులుగా సమ్మె చేపట్టిన మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి బదులుగా పోటీ కార్మికులను రంగంలోకి దించారు అధికారులు. దీంతో కడుపుమండిన కార్మికులు అధికారులను అడ్డుకున్నారు.

నరసరావుపేట లో డంపింగ్‌ లారీలను వెళ్లనీయకుండా మునిసిపల్‌ కార్మికులు అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిలార్‌ మసూద్‌ పోలీసులతో మాట్లాడారు. పారిశుధ్య కార్మికుల స్థానంలో పోటీ కార్మికులను అధికారులు రంగంలోకి దించడం పట్ల మున్సిపల్‌ కమిషనరును కార్మికులు నిలదీశారు. పోటీ కార్మికులను పనిలోకి తీసుకోవద్దని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా మున్సిపల్‌ కమిషనర్‌ బయటికి వెళ్ళేందుకు కారు ఎక్కగా, కార్మికులు కారుకు అడ్డుపడి గేట్లు మూసి అడ్డుకున్నారు. పారిశుధ్య కార్మికులంతా వాటర్‌ ట్యాంకుపై ఎక్కి నిరసన తెలిపారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోటి కార్మికులను పనిలోకి దించబోమని స్పష్టమైన హామీ ఇస్తేనే పైనుంచి కిందకి దిగుతామని కార్మికులు డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు సిఎం హామీ ఇచ్చిన విధంగా సమానపనికి సమానవేతనం, ఉద్యోగాల పర్మినెంటు, ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ రిస్కు అలవెన్సు, క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 జీతం, తదితర డిమాండ్లపై చేపట్టిన సమ్మె 6వ రోజు కొనసాగుతోంది. కార్మికుల డిమాండ్లు నెరవేరేవరకు సమ్మెను విరమించేదేలేదని రాష్ట్ర వ్యాప్తంగా పలు రూపాల్లో నిరసనలు చేస్తున్నారు. నేటి నుండి మున్సిపల్‌ కార్మికులు సమ్మెను ఉధృతంగా చేపట్టారు.

➡️