పాలిసెట్‌లో 87.61 శాతం అర్హత

May 8,2024 23:21 #policet, #Results

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో శాఖ కమిషనరు చదలవాడ నాగరాణి బుధవారం విడుదల చేశారు. ఏప్రిల్‌ 27న జరిగిన ఈ పరీక్షకు 1,42,035 మంది హాజరుకాగా, 1,24,430 (87.61 శాతం) మంది అర్హత సాధించారు. ఫలితాల్లో బాలురు కంటే బాలికలే పైచేయి సాధించారు. 56,464 మంది బాలికల్లో 50,710 (89.81 శాతం) మంది అర్హత సాధించగా, 85,561 మంది బాలురులో 73,720 (86.16 శాతం) మంది అర్హత సాధించారు. 120 మార్కులకు జరిగిన పరీక్షలో ఆరుగురు 120 మార్కులు తెచ్చుకొని మొదటి ర్యాంకు సాధించారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో విడుదల చేస్తామని కమిషనరు ప్రకటించారు. 2024-25 విద్యాసంవత్సరం జూన్‌ 10 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 267 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 82,870 సీట్లు ఉన్నాయని తెలిపారు. ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య, శిక్షణ మండలి అధికారులు పాల్గొన్నారు.

➡️