సముద్రంలో బోటు దగ్ధం

Feb 12,2024 21:00 #Acident, #Boat fire, #Kakinada
  • రూ.20 లక్షల ఆస్తి నష్టం
  • సురక్షితంగా బయటపడ్డ మత్స్యకారులు

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా): డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు సమీపాన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన సూరాడ కృష్ణకు చెందిన రెండు బోట్లలో 20 మంది మత్స్యకారులు అమీనాబాద్‌ రేవు నుంచి చేపల వేటకు సోమవారం ఉదయం బయలుదేరారు. కోనసీమ జిల్లా ఓడలరేవు సమీపంలో చేపలను వేటాడుతుండగా ఒక బోటు ఇంజను నుంచి మంటలు వచ్చాయి. కొద్ది క్షణాల్లోనే బోటుకు వ్యాపించడంతో మత్స్యకారులు సముద్రంలోకి దూకేశారు. ఇది గమనించిన రెండో బోటులోని మత్స్యకారులు వారిని రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 11 మంది మత్స్యకారులున్నారు. ఇంజను వేడెక్కడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని మత్స్యకారులు చెబుతున్నారు. బోటు పూర్తిగా కాలిపోవడంతో రూ.20 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. ఘటనా స్థలాన్ని మెరైన పోలీసులు పరిశీలించారు.

➡️