సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర

  •  రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి – రంపచోడవరం (అల్లూరి జిల్లా) : బిజెపి హయాంలో అడవులను, సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే కుట్రలు తీవ్రమయ్యాయని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో ‘భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ పేరిట ఆదివారం జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్య్రం, పౌర హక్కులకు మోడీ హయాంలో భంగం కలుగుతోందన్నారు. అటువంటి బిజెపికి రాష్ట్రంలో టిడిపి, జనసేనలు ప్రత్యక్షంగా, వైసిపి పరోక్షంగా మద్దతు తెలపడం దారుణమన్నారు. మోడీకి చంద్రబాబు, జగన్‌ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీ అభివృద్ధికి ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావులను గెలిపించాలని కోరారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాలకుల తీరుతో ఆదివాసీల బతుకులు రోజురోజుకూ దుర్భరంగా మారుతున్నాయన్నారు. గిరిజనులకు ఈ మాత్రమైనా హక్కులు వచ్చాయంటే దానికి కారణం వామపక్ష పార్టీలే కారణమన్నారు. ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ మాట్లాడుతూ దేశానికి కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళ రోల్‌ మోడల్‌గా నిలుస్తోందన్నారు. గుజరాత్‌లో అభివృద్ధి డొల్లగా మారిందని విమర్శించారు. ఎన్‌డిఎ కూటమిని దేశ ప్రజలు ఓడించాలని, ఇండియా వేదికను గెలిపించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు ఎం వాణిశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కో – కన్వీనర్‌ కె విజయరావు, మాజీ ఐఎఎస్‌ అధికారి శ్రీనివాస్‌, ఇండియా బ్లాక్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️