ఆకాష్‌ బైజూస్‌లో అగ్ని ప్రమాదం

ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం):గాజువాకలోని ఆకాష్‌ బైజూస్‌ బ్రాంచిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రూ.కోటి వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారుల కథనం ప్రకారం.. ఆకాష్‌ బైజూస్‌ విద్యా సంస్థ బ్రాంచి గాజువాకలో వైభవ్‌ జ్యూయలర్స్‌ పైన రెండో ఫ్లోర్‌లో ఉంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంగళవారం ఉదయం భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో కంప్యూటర్లు, ఫ్యాన్లు, బెంచీలు, సీసీ కెమెరాలు, బోధనకు సంబంధించిన ప్రొజెక్టర్లు కాలి బూడిదయ్యాయి. మంటల తీవ్రత కారణంగా స్లాబ్‌కూ పగుళ్లు ఏర్పడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గాజువాక తహశీల్దార్‌ పాలవెల్లి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఉదయం జరగడంతో ప్రాణ నష్టం జరగలేదని, తరగతులు నిర్వహించే సమయంలో జరిగితే పరిస్థితి మరోలా ఉండేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ ప్రమాదంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. జనావాసాల మధ్య ఇటువంటి సంస్థలకు అనుమతులు ఇచ్చేటప్పుడు జివిఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, ఫైర్‌ అధికారులు కఠినంగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు.

➡️