ఎన్నికల సమయంలోనూ ఆగని పన్నుల బాదుడు

Apr 12,2024 16:40 #CPM AP, #Vijayawada
  • ఇంటి పన్ను పెంపును నిరసిస్తూ విజయవాడలో బాబురావు నేతృత్వంలో సిపిఎం నిరసన 
  •  ఆస్తి పన్ను కాపీలు దగ్ధం చేసిన సిపిఎం కార్యకర్తలు, స్థానికులు 

ప్రజాశక్తి-విజయవాడ : ఎన్నికల సమయంలోనూ ఆగని పన్నుల బాదుడు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని విజయవాడ సెంట్రల్  సిపిఎం అభ్యర్థి  చిగురుపాటి బాబురావు పిలుపునిచ్చారు. ఏప్రిల్ ఒకటి నుండి పట్టణాలలో 15% ఇంటి పన్ను పెంచుతూ జారీచేసిన ఆస్తి పన్ను కాపీలను సిపిఎం కార్యకర్తలు, స్థానికులలతో కలిసి ఆయన దగ్ధం చేశారు. నేడు విజయవాడ 62వ డివిజన్ పాయికాపురం ఎల్ బి ఎస్ నగర్, పటేల్ నగర్, లక్ష్మీ నగర్ తదితర ప్రాంతాల్లో బాబురావు పర్యటించారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు, ప్రజలు అపూర్వంగా స్వాగతం పలికారు. చెత్త పన్ను, నీటి మీటర్లు, డ్రైనేజీ పన్నులపై ప్రజాగ్రహం వెల్లడైంది.  ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ…… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లలో 100%  ఇంటి పన్నులు పెంచాయని మండిపడ్డారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందన్నారు. కేంద్రం ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయి అందరికంటే ముందే అమలు చేసిందని వివరించారు. పన్నుల పెంపుకు మోడీ ఆదేశాలే కారణమని, కేంద్రానికి లొంగి జగన్ సర్కార్ పన్నుల బాదుడు ప్రజలపై వేస్తున్నారని మండిపడ్డారు. బిజెపితో జతకట్టిన తెలుగుదేశం ఈ పాపాలలో భాగస్వామీ అయ్యిందని దుయ్యబట్టారు. పన్నుల భారాలపై నికరంగా పోరాడే సిపిఎం, బాబురావుని గెలిపించాలని కోరారు. ఈ ఐదేళ్లలో పన్ను రెట్టింపు అయిందని విజయవాడ నగరపాలక సంస్థలో 100 కోట్ల భారం పడిందని తెలిపారు. పట్టణ సంస్కరణల పేరుతో ప్రతి పనికి రేటు కట్టి యూజర్ చార్జీలు వసూలు చేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలు ప్రమాదంగా మారాయని పేర్కొన్నారు.  మీటర్ల కోసమే కొత్త పైపులైన్లు నగరమంతా వేస్తున్నారని, మరుగుదొడ్లను లెక్కించి డ్రైనేజీ చార్జీలు విధిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల భారాలపై అసెంబ్లీలో వాణి వినిపించాలంటే సిపిఎం అభ్యర్ధిగా తనను గెలవాలని కోరారు.  ప్రజలందరూ ఈ ఉద్యమంలో కలిసి రావాలని, శాసనసభకు సిపిఎం, కమ్యూనిస్టులను పంపాలని పిలుపునిచ్చారు.  నేడు జరిగిన ఈ పాదయాత్ర, ఆందోళనలో సిపిఎం నేతలు బీ.రమణారావు, కే.దుర్గారావు, సిహెచ్.శ్రీనివాస్, ఝాన్సీ, నాగేశ్వరరావు, సాంబిరెడ్డి, నాగరాజు, రామాంజనేయులు, రఫీ, చిన్ని, జమలమ్మ, పిచ్చమ్మ, చంద్రశేఖర్, భారతి, రాంబాబు, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.

➡️