సెల్‌ టవర్‌ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం

May 23,2024 15:54 #Kakinada, #police, #Save
  • కాపాడిన త్రీ టౌన్‌ పోలీసులు

ప్రజాశక్తి-కాకినాడ : సెల్ఫోన్‌ దొంగతనం చేసావ్‌ అంటూ.. చేసిన నిందలకు తట్టుకోలేక ఒక యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న త్రీ టౌన్‌ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రిస్క్‌ చేసి, ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడితో చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. వివరాల్లోకెళ్తే కాకినాడ జిల్లా చిత్రాడకు చెందిన ప్రదీప్‌ కుమార్‌ను సెల్ఫోన్‌ దొంగతనం చేసావ్‌ అంటూ స్థానికులు అవమానించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ప్రదీప్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకోవాలని భావించి కాకినాడ త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ టవర్‌పై ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ ఎం.సాగర్‌బాబు బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ దగ్గరకు చేరుకుని సమయ స్ఫూర్తిగా వ్యవహరించి ఆ యువకుడు చేసే ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించగలిగారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఓ యువకుడు ప్రాణాలను కాపాడిన ఎస్‌ఐ సాగర్‌ బాబు, వారి సిబ్బంది శ్రీనివాసరావును స్థానికులు అభినందించారు. అనంతరం యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

➡️