సలహాదారుగా ఉండి రాజకీయాలు మాట్లాడుతారా?

atchannaidu on amaravati protest 1500days
  •  సజ్జలపై ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సోమవారం లేఖ రాశారు. సలహాదారులా కాకుండా వైసిపి కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మార్చి 18, 22 తేదీల్లో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారని అన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సలహాదారు పదవి నుంచి తొలగించాలని కోరారు.
క్షమాపణ యాత్రగా మార్చాలి : వర్ల రామయ్య
ఐదేళ్లుగా గడప దాటి బయటకు రాని జగన్‌కు ఇప్పుడు బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లే అర్హత లేదని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. బస్సు యాత్రను క్షమాపణ యాత్రగా మార్చాలని అన్నారు. టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు 730కు పైగా హామీలిచ్చారని, వీటిల్లో ఎన్ని నెరవేర్చారో సమాధానం చెప్పాలన్నారు. నారా లోకేష్‌ కాన్వారును టార్గెట్‌ చేసి రెండు రోజుల్లో నాలుగు సార్లు తనిఖీ చేయడం దుర్మార్గమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలతో జగన్‌ డ్రగ్‌ మాఫియా ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు వారితో పత్రికా ప్రకటనలతో పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కీలకమైన ఫైళ్లు, హార్డ్‌ డిస్క్‌లు, చెక్‌బుక్‌లతో దొరికిన సంధ్యా కంపెనీ బస్సును పోలీసులు సిబిఐకి అప్పగించకుండా తిరిగి కంపెనీకి ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు.

➡️