అదివాసీ మహిళను ప్రధాని ఘోరంగా అవమానించారు : మంత్రి సీతక్క

ప్రజాశక్తి- హైదరాబాద్‌ : బిజెపి అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌ కె.అద్వానీ ఇంటికి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం స్వయంగా వెళ్లి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలబడే ఉన్నా ప్రధాని మోడీ కూర్చొని ఉండడం పట్ల తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో సోమవారం ఆమె పోస్టు చేశారు. ఆదివాసీ మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ప్రధాని మోడీ ఘోరంగా అవమానించారని విమర్శించారు. ‘భారతదేశంలో నియంత పాలనకు ఈ ఫొటో చక్కటి ఉదాహరణ. ఓ ఆదివాసీ మహిళకు జరిగిన ఈ ఘోర అవమానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదే విషయమై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందిస్తూ, ‘ప్రధాని మోడీ గారు… ఆదివాసీ అంటే చులకనా? రాష్ట్రపతి పదవి అంటే చులకనా? లేక ప్రజాస్వామ్యం అంటేనే చులకనా?’ అని ‘ఎక్స్‌’లో ప్రశ్నించింది. వయోభారం వల్ల అద్వానీ కూర్చోవచ్చుగానీ, రాష్ట్రపతి నిల్చున్నప్పుడు ప్రధాని మోడీ కూర్చోవడమేమిటని ఇప్పటికే పలువురు సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

➡️