సుప్రీం గైడ్‌లైన్స్‌కు లోబడే యాడ్స్‌

Ads subject to Supreme Guidelines

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు

ప్రజాశక్తి-అమరావతి : వైసిపి రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించేలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రకటనలు (అడ్వటైజ్‌మెంట్స్‌) జారీ చేస్తోందన్న పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఇకపై జారీ చేసే ప్రకటనలు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు లోబడి ఉండాలంది. వ్యక్తిగత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, కాగ్‌, సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనరు, వైసిపి ప్రధాన కార్యదర్శి, జగతి పబ్లికేషన్స్‌ ఎమ్‌డి, ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌ ఎమ్‌డి, విశాఖలోని సిబిఐ ఎస్‌పి, ఢిల్లీలోని సిసిఆర్‌ జిఎ (ప్రభుత్వ ప్రకటనల్లో కంటెంట్‌ రెగ్యులేషన్‌ కమిటీ) సభ్యకార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 6కు వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ‘కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని రాష్ట్ర సర్కారు 2019 జూన్‌ నుంచి భారీగా యాడ్స్‌ ఇస్తోంది. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దమని పేర్కొంటూ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామస్తుడు చెన్నుపాటి సింగయ్య పిల్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం చేసిన ఖర్చును వైసిపి నుంచి రాబట్టేలా ఉత్తర్వులివ్వాలని కోరారు.

➡️