కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మికులకు కనీస వేతనం, పనిభద్రత

May 1,2024 12:56 #cpm, #May Day, #V.Srinivas rao
  •  మేడే పతాకావిష్కరణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో లక్షల సంఖ్యలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికలకు కనీస వేతనాలు ఇవ్వాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. మేడే సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడారు. రాష్ట్రంలో కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని అన్నారు. ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు పెరిగాయని, రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే స్కీమ్‌ వర్కర్లు, సచివాలయాలు, మెడికల్‌, విద్యతోపాటు మున్సిపల్‌ ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారికి చట్టం ప్రకారం భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రభుత్వాలు, పాలకులు కార్పొరేట్ల సేవలో తరిస్తున్నాయని, ఎర్రజెండా ఒక్కటే వారి తరపున పోరాడుతోందని అన్నారు. ఈ ప్రభుత్వాలు కూడా కార్పొరేట్లు కావాలో.. ప్రజలు కావాలో.. తేల్చుకోవాలని హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మేడేను కార్మికుల రోజుగా గుర్తించడానికి ఇష్టపడటం లేదని, విశ్వకర్మ జయంతి పేరుతో కార్మిక వర్గాన్ని అవమానిస్తోందని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టే కబుర్లు చెబుతున్న బిజెపి ఎంపిల్లో నేరస్తులు, రేపిస్టులు ఉన్నారని, కర్ణాటకలో రేవణ్ణ ఘటనే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో బిజెపిని సాగనంపాల్సిన అవసరం ఉందని వివరించారు. మాజీ ఎంపి పి మధు మాట్లాడుతూ.. దేశంలో కార్మికులపైనా, కష్టజీవులపైనా, రైతాంగంపైనా దోపిడీ అంతం కావాలని అన్నారు. కార్పొరేట్ల అడుగులకు మడుగులు వత్తే పాలకులు పోవాలని హెచ్చరించారు. వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి రెండు పార్టీలూ కార్మికవర్గానికి నష్టం కలిగించే లేబర్‌ కోడ్‌లకు పార్లమెంటులో ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి తులసీదాసు, రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాం, హరికిషోర్‌, సీనియర్‌ నాయకులు వై కేశవరావు పాల్గొన్నారు. అంతకముందు ప్రజానాట్య మండలి కళాకారులు మేడే గీతాలు ఆలపించారు.

➡️