మోడీ పాలనలో వ్యవసాయ రంగం పతనం

Dec 11,2023 08:15 #raithu sangam

– రైతు కవనంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని, మోడీని ఓడించకుంటే మరింత పతనం దిశగా వెళ్లే అవకాశం ఉందని ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య తెలిపారు. కర్నూలులోని కార్మిక కర్షక భవన్‌లో ఆదివారం సాహితీ స్రవంతి, ఎఐకెఎస్‌ సంయుక్తంగా రైతుకవనం నిర్వహించారు. సిపిఎం జిల్లా అధ్యక్షులు ఆవుల బసప్ప అధ్యక్షతన జరిగిన ఈ సభలో కృష్ణయ్య మాట్లాడుతూ.. మోడీ సంస్కరణల వల్ల వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గి ఉత్పత్తి ఖర్చులు పెరిగాయన్నారు. 85 శాతం రైతులు ఐదెకరాలలోపు వారేనని తెలిపారు. 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ రైతులకు ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం అదనంగా వచ్చేటట్లు చేస్తానన్నారని, వ్యవసాయ బీమా చేస్తానని హామీ ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు రైతులకు అందుబాటులో లేవని తెలిపారు. మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేవని, వ్యవసాయ రంగం కార్పొరేట్‌ కంపెనీల మయం కానుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో త్వరలో విజయవాడలో రైతు సదస్సు నిర్వహించనున్నామని చెప్పారు. అందరూ ఐక్యమై వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన అవసరముందన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ మాట్లాడుతూ.. వ్యవసాయరంగంపై కేంద్రం పెత్తనమేమిటిని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 1990 నుండి ఇప్పటి వరకు 3 లక్షల మంది రైతులు అత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రతి రోజు 28 మంది రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకఅష్ణ మాట్లాడుతూ.. అన్నదాతను కాపాడుకోకపోతే భవిష్యత్తు ఉండదన్నారు. జనకవనంలో సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి అవుల చక్రపాణియాదవ్‌, కవులు కల్యాణదుర్గం స్వర్ణలత, పార్వతయ్య, సలీం, పులిచేరి మహేష్‌ పానుగంటి చంద్రయ్య, జంగం స్వయం ప్రభలు కవితలు చదివారు. సమావేశంలో ప్రజానాట్యమండలి నాయకులు బసవరాజు రైతు చైతన్యగీతాలు పాడారు. సమావేశంలో డివైఎఫ్‌ఐ నాయకులు నాగేష్‌, ఐలు నాయకులు వెంకటస్వామి, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం కన్వీనర్‌ జెయన్‌ శేషయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️