బిజెపితో పొత్తు నయవంచనే

  •  అభివృద్ధి కోసమంటూ ప్రజల చెవుల్లో పువ్వులు
  •  మోడీని గద్దె దించకపోతే దేశానికే ముప్పు
  •  వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : బిజెపితో తాము పొత్తు పెట్టుకున్నది రాష్ట్రాభివృద్ధి కోసమే అంటూ టిడిపి, జనసేన నయవంచనకు పాల్పడుతున్నాయని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టి ప్రజలపై భారాలు మోపుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపితో అభివృద్ధి ఎలా సాధ్యమని, అలా చెప్పడం రాష్ట్ర ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెట్టడమేనని పేర్కొన్నారు. బిజెపిని సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని, లౌకిక భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ‘ఇండియా’ ఫోరం అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. అనకాపల్లిలోని రోటరీ క్లబ్‌లో శుక్రవారం ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాలక పార్టీల మోసాలను ఎండగండుతూ రూపొందించిన ‘నయవంచన’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని వంచిన మోడీతో టిడిపి, జనసేన, వైసిపి అంటకాగుతున్నాయని తప్పుబట్టారు. 2014 ఎన్నికల్లో మోడీతో పొత్తుపెట్టుకొని ఏం సాంధించారని చంద్రబాబును ప్రశ్నించారు.
12 ఏళ్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్న ప్రస్తుత అనకాపల్లి పార్లమెంట్‌ బిజెపి అభ్యర్థి సిఎం రమేష్‌ ప్రజలకు చేసిందేమీలేదని తెలిపారు. స్థానికుడు కాని, అందుబాటులో లేని వ్యక్తి కంటే సమస్యలపై పనిచేసే ‘ఇండియా’ అభ్యర్థి వేగి వెంకటేష్‌ను గెలిపించుకోవాలని కోరారు. మూతపడ్డ షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించుకోవాలన్న దృక్పథం కలిగిన అభ్యర్థులను బలపరచాలన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కో- కన్వీనర్‌ విజయరావు మాట్లాడుతూ బిజెపి పాలనలో అసమానతలు, నిరుద్యోగం పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఎఎస్‌ అధికారి బి శ్రీనివాస్‌, ‘ఇండియా’ అభ్యర్థి వేగి వెంకటేష్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి బి వెంకటరమణ, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ జిల్లా కన్వీనర్‌ పిఎస్‌ అజరు కుమార్‌, ఆమ్‌ ఆద్మీ రాష్ట్ర నాయకులు రమేష్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం అప్పలరాజు పాల్గొన్నారు.

➡️