మానవ హక్కుల ప్రదాత అంబేద్కర్‌-కెయు ఉపకులపతి ఆచార్య జ్ఞానమణి

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ (కృష్ణాజిల్లా) :స్వతంత్ర భారత దేశంలో మానవ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి, రాజ్యాంగ రచన ద్వారా తనకొచ్చిన అవకాశాన్ని సాకారం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి జ్ఞానమణి పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎస్‌సి, ఎస్‌టి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 134వ జయంతి వేడుకలలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో మానవ హక్కుల ప్రదాతగా అంబేద్కర్‌ ప్రపంచ దేశాలలో కీర్తింపబడుతున్నారన్నారు. విద్య ద్వారా మాత్రమే నిమ్న జాతుల స్థితి గతులు మారుతాయని గట్టిగా నమ్మిన వ్యక్తి అని చెప్పారు. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య కె శోభన్‌ బాబు మాట్లాడుతూ మహనీయుల గురించి ప్రసంగాలు విని ఊరుకోకుండా ఆచరించినప్పుడే సార్థకత చేకూరుతుందన్నారు. తొలుత అంబేద్కర్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్‌ జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఉపకులపతి, రిజిస్ట్రార్‌ నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎస్‌సి, ఎస్‌టి విభాగం సమన్వయకర్త డా ఎం శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ప్రధాన ఆచార్యులు ఆచార్య సుందర కృష్ణ, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ విజయకుమారి పాల్గొన్నారు.

➡️