అంగన్వాడీ సమ్మె ఉద్రిక్తం

  • వి.ఆర్‌.సి సెంటర్‌ వద్ద రాస్తారోకో సందర్బంగా అరెస్ట్‌, తోపులాట
  • తీవ్ర అశ్వస్థతకు గురైన అంగన్వాడీ మహిళలు, సీఐటీయూ నాయకులు
  • అనేక మంది మహిళలకు గాయాలు
  • మహిళల పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులు
  •  కొందరి పరిస్థితి విషమం

ప్రజాశక్తి-నెల్లూరు : అంగన్వాడీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 40వ రోజుకు చేరుకుంది. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లోని స్వతంత్ర పార్క్‌ నుండి అంగన్‌వాడీ మహిళలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు ర్యాలీగా బయలుదేరి వీఆర్సీ సెంటర్‌కు చేరుకుని అక్కడ రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. రాస్తారోకోను భగం చేయడానికి పోలీసులు సిఐటియు నాయకులను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. సిఐటియు నాయకులు అరెస్టుని అంగన్వాడీ మహిళలు అడ్డుకొన్నారు. ఈ క్రమంలో పోలీసుల-మహిళల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. మగ పోలీసులు అంగన్వాడీ మహిళలని దౌర్జన్యంగా నెట్టి వేశారు. పోలీసులు కొంతమందిని కాళ్ళతో, చేతులతో పిడిగుద్దులు గుద్దారు. రోడ్లపై ఈడ్చారు. పోలీసు వ్యానులో విసిరి పడేశారు. ఈ క్రమంలో పోలీస్‌వ్యాన్‌కి అంగన్‌ వాడీ మహిళలు అడ్డంగా కూర్చుని నాయకులను తీసుకువెళ్లనీయమని అడ్డుకున్నారు. ఒకటిన్నర గంట సేపు ఉద్రిక్త పరిస్థితులు విఆర్సీ సెంటర్లో నెలకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అంగన్వాడీ మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే అజయ్ కుమార్‌, టివివి ప్రసాద్‌ సైతం సొమ్మసిల్లారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజయ్ కుమార్‌,సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, ఐఎఫ్‌ టి యు నాయకులు రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 రోజుల నుండి అంగన్వాడీలు నిరసనలు చేస్తుంటే జగన్‌ మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రోమ్‌ నగరం తగలపడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెలు వాయించుకుంటున్నట్లు జగన్‌ వ్యవహరిస్తున్నాడన్నారు. తక్షణమే అంగన్వాడీి కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్‌ కార్యదర్శి బత్తల కిష్టయ్య,సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు,రూరల్‌ అధ్యక్ష కార్యదర్శులు కొండా ప్రసాద్‌ కిన్నెర కుమార్‌,ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్‌ మస్తాన్‌ బీ, అధ్యక్ష, కార్యదర్శులు, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్సులు సుజాతమ్మ, రెహనా బేగం తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

➡️