సమ్మె శిబిరంలో స్పృహతప్పిపడిపోయిన అంగన్వాడి కార్యకర్త

ప్రజాశక్తి- చాగల్లు (తూర్పు గోదావరి) : గత 30 రోజులుగా మండల కేంద్రమైన చాగల్లు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం కొనసాగుతోంది. సమ్మె శిబిరంలోనికి ప్రభుత్వ అధికారులు వచ్చి అంగన్వాడి కార్యకర్తలు సమ్మె నోటీసును తీసుకోవాలని కోరగా అంగన్వాడి కార్యకర్తలు తీసుకోబోమని నిరాకరించారు. దీంతో వారి ఇళ్లకు వెళ్లి సమ్మె నోటీస్‌ అంటిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పి.విజయ కుమారి, కే.లక్ష్మి మాట్లాడుతూ … తాము ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన తరువాతే సమ్మెలో దిగామని తెలిపారు. టెంట్లో అంగన్వాడి కార్యకర్త స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరు కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద సమ్మెలో పాల్గొన్నారు. సగం మంది ఇక్కడ సమ్మెలో కొనసాగుతున్నట్లు తెలిపారు. ‘ గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం మాకు కావాలి ‘ అంటూ అంగన్వాడీలు నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ, ఐసీడీఎస్‌ ప్రీస్కూల్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పి.విజరు కుమారి, కే.లక్ష్మి, కే.దమయంతి, ఏ.శ్రీదేవి, బి.మహాలక్ష్మి, ఎస్‌.అరుణ కుమారి, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️