సమ్మె న్యాయ సమ్మతం- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

anganwadi workers strike 19th day vjA

అంగన్‌వాడీలకు వామపక్షాల మద్దతు

స్పందించకపోతే ప్రత్యక్ష సంఘీభావ ఆందోళనలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు, మినీవర్కర్లు చేపట్టిన సమ్మె న్యాయసమ్మతమైందని, ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 19వ రోజూ కొనసాగింది. దీనిలో భాగంగా శనివారం విజయవాడ ధర్నా చౌక్‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్దకు సిపిఎం, న్యూడెమోక్రసీ, లిబరేషన్‌, ఆర్‌ఎస్‌పి నేతలు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలు సమస్యలపై తాడోపేడో తేల్చుకుని, శిబిరం నుండి ఇంటికి వెళ్లాలని అన్నారు. వారు చేస్తున్న పోరాటం రాష్ట్ర ప్రజానీకానికి స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పారు అన్నిచోట్లా ఆందోళనలు పూర్తి క్రమశిక్షణతో, ప్రభుత్వానికి వణుకుపుట్టే విధంగా పట్టుదలతో, సమరశీలత్వంతో సాగుతున్నాయన్నారు. ప్రభుత్వాధినేతలు ఇప్పుడు నవరత్నాలని చెబుతున్నారని, ఇకముందు నవ అబద్ధాలు అని చెప్పాల్సివస్తుందన్నారు. 2018లో జీతం పెంచితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ తాను పెంచానని చెప్పడం సరికాదని, ఆయన సిఎం అయిన ఏడాది తరువాత రూ.1000 మాత్రమే పెంచారని పేర్కొన్నారు. అయినా తామే జీతాలు పెంచామని, ఎవరికీ ఏమీ తెలియదన్నట్లు అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. పైగా అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒకవేళ ఇస్తున్నదే నిజమైతే లిస్టు ప్రకటించాలని డిమాండు చేశారు. రూ.11,500 జీతం తీసుకుంటున్నారనే పేరుతో సంక్షేమ పథకాలు ఆపేశారని విమర్శించారు. పైగా ప్రభుత్వం అన్నిరకాల పనులూ అంగన్‌వాడీలతో చేయిస్తూ వేధింపులు, బెదిరింపులకు దిగుతోందన్నారు. అంగన్‌వాడీలు సమ్మె విరమించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటున్నారని, అది సాధ్యంకాదని చెప్పారు. ఇప్పటి వరకూ అంగన్‌వాడీలపై ఏ ఒక్కరి ఫిర్యాదు లేదని, పైగా తల్లులకు భరోసా ఉందని తెలిపారు. అక్కాచెల్లెమ్మలపై ప్రేమ ఉందని చెబుతూ వారిని రోడ్డుపై పడేశారని అన్నారు. తప్పుడు ప్రచారాలతో సమ్మెను అణచలేరని హెచ్చరించారు. రూ.525 కోట్లతో గెస్ట్‌హౌస్‌ కట్టారని, అంగన్‌వాడీల జీతాలు పెంచితే రూ.400 కోట్లు మాత్రమే అవుతుందని అయినా పెంచడం లేదని పేర్కొన్నారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో రూ.20 వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారని అన్నారు. ఆ డబ్బులతో అందరికీ జీతాలు పెంచొచ్చని, ఆ పనిచేయకుండా అదానీకి దోచిపెడుతున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన చర్చల్లో అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తామంటున్నారని, ఒకవేళ అధికారంలోకి వస్తామని నమ్మకం ఉంటే ఇప్పటి నుండే అమలు చేయొచ్చని అలా ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని, సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెకు సంఘీభావం చెబుతున్న అధికారపార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి జీతాలు పెంచాలని చెప్పాలని అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా న్యాయం చేస్తామని చెబుతున్నారని, అది వారి ఎన్నికల ప్రణాళికలో పెట్టాలని కోరారు. అంగన్‌వాడీల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని డిమాండు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యాన ప్రత్యక్ష సంఘీభావ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సిపిఐఎంఎల్‌ న్యూ డెమెక్రసీ నాయకులు పొలారి మాట్లాడుతూ అంగన్‌వాడీలు చేస్తున్న డిమాండ్లలో న్యాయసమ్మతం లేనివి ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కడుపుకాలి ఆందోళన చేస్తుంటే కనీసం స్పందించని సిఎం అధికారంలో ఉండటానికి అనర్హుడని అన్నారు. సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు హరినాథ్‌ మాట్లాడుతూ పిల్లలను కన్న బిడ్డల్లా చూసుకునే అంగన్‌వాడీలు రోడ్డెక్కితే చీమకుట్టినట్లయినా లేని ఈ ప్రభుత్వం ఒక్కక్షణం కూడా అధికారంలో ఉండకూదని అన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయమంటే దాడులకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌పి నాయకులు రవికాంత్‌ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, డి.రమాదేవి, మంతెన సీతారాం, న్యూడెమోక్రసీ నాయకులు రవిచంద్ర, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె,సుబ్బరావమ్మ, ఉపాధ్యక్షులు సుప్రజ తదితరులు పాల్గన్నారు. సర్వశిక్ష శిబిరానికి మద్దతు ధర్నాచౌక్‌లోనే ఆందోళన చేపట్టిన సర్వశిక్ష సిబ్బంది సమ్మెకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి, మంతెన సీతారాం తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సిబ్బంది చేస్తున్న సమ్మెకు పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించే వరకూ ఆందోళన కొనసాగించాలని సూచించారు.

 

cpm support to ssa

విజయవాడ ధర్నా చౌక్ లో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలియజేస్తూ…

 

➡️