మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి

anganwadi workers strike in ap mla mp
  • అంగన్‌వాడీల ఆందోళన ఉధృతం
  • విజయవాడలో సమ్మె శిబిరం కూల్చేసిన పోలీసులు

ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అంగన్‌వాడీలు సమ్మెను ఉధృతం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీల పట్ల పోలీసులు కర్కశంగా వ్యహరించారు. బలవంతంగా అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో వారి మధ్య తీవ్ర స్థాయిలో పెనుగులాట చోటుచేసుకుంది. 160 మందికిపైగా అంగన్‌వాడీలను, నేతలను అరెస్ట్‌ చేశారు. 16 రోజులుగా ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీలు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని (టెంట్‌ను) పీకివేశారు. దీనికి ముందు ఈ శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్‌.బాబూరావు సందర్శించి మద్దతుగా మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెలను సిఎం వైఎస్‌.జగన్‌మోహాన్‌రెడ్డి వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో శిశు సంక్షేమ భవనం నుంచి మినీ వ్యానుల్లో వెళుతున్న అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటికి వెళ్తున్న అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి పట్ల, అంగన్‌వాడీల పట్ల ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి, దూషణలకు దిగారు. దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో, మరో మార్గంలో వెళ్లగా మళ్లీ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురు సిఐటియు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని అంగన్‌వాడీల సమ్మె శిబిరానికి ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వచ్చి సందర్శించి మద్దతు తెలిపారు. వారి డిమాండ్లను సిఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. పెడనలో మంత్రి జోగి రమేష్‌ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామల్లో ఎంఎల్‌ఎల కార్యాలయాలను, ఇళ్లను ముట్టడించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్‌, గుంతకల్లు, శింగనమల, రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడించారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా చేశారు. గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి ఎంఎల్‌ఎల ఇళ్లను ముట్టడించారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ఎమ్మెల్యే కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్డులోని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. అంగన్‌వాడీల సమస్యను చీఫ్‌ సెట్రరీని దృష్టికి తీసుకెళతానని గుంటూరులోని బ్రాడీపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. పొన్నూరు, తెనాలి ఎమ్మెల్యేల ఇళ్లను అంగన్‌వాడీలు ముట్టడించారు. నరసరావుపేటలో సమ్మె శిబిరాన్ని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, న్యాయవాదులు సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు.

ఏలూరులో ఎంఎల్‌ఎ ఆళ్ల నాని ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు. పెదపాడు, పెదవేగి, దెందులూరు, నూజివీడు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఉంగుటూరు, ఆచంట ఎమ్మెల్యేల ఇళ్లను, క్యాంప్‌ కార్యాలయాలను ముట్టడించారు. తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇంటిని ముట్టడించి ఆయనకు వినతిపత్రం అందజేశారు. పాలకొల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆట పాటలతో నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంటిని, రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి తానేటి వనిత, తునిలో మంత్రి రాజా ఇళ్లను ముట్టడించారు. ముమ్మిడివరం, రావులపాలెం, గోపాలపురం, నిడదవోలు, జగ్గంపేట, కాకినాడ రూరల్‌ ఇళ్ల వద్ద బైటాయించారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ క్యాంపు కార్యాలయాన్ని, ఎంపి డాక్టర్‌ బివి.సత్యవతి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు. అనకాపల్లిలో మానహారం నిర్వహించారు. దేవరాపల్లి మండలం తారువలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. చోడవరంలో ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అల్లూరి జిల్లా పాడేరులో ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ మీదుగా తలారిసింగిలోని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇంటి వరకూ ర్యాలీ నిర్వహించారు. అరకులోయ ఎమ్మెల్యే ఇంటిని, ముంచంగిపుట్టులో విశాఖ జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ సుభద్ర ఇంటిని ముట్టడించారు. విజయనగరం జిల్లా గరివిడిలో మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంతో పాటు విజయనగరం, నెల్లిమర్ల, ఎస్‌.కోట, బొబ్బిలి, రాజాం ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో డిప్యూటీ సిఎం రాజన్నదొర ఇంటిని, పార్వతీపురం, పాలకొండ, కురుపాం ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడించి నిరసన తెలిపారు. శ్రీకాకుళంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయం వద్ద, ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం నివాసం ఎదుట బైఠాయించారు. పలాసలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని, కవిటిలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ ఇంటిని ముట్టడించారు.

  • ఇలాగే తిరుగుతుండండి : బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి

అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలని కోరడం సబబే అని, ఏ మేరకు పెంచాలనే నిర్ణయం ముఖ్యమంత్రి జగనన్నదే అని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ముఖ్యమంత్రిపై నమ్మకం ఉంచాలని, అసలు ఎంతమందికి నమ్మకం ఉందో చేతులు ఎత్తాలని కోరారు. ఒక్కరూ చెయ్యెత్తకపోయేసరికి ‘నమ్మకం లేనప్పుడు ఎవరేం చేస్తారు… ఇట్లాగే తిరుగుతూ ఉండండి’ అని అన్నారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు కోన ఇంటిని ముట్టడించారు. కోన రఘుపతికి వినతిపత్రం ఇద్దామని వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కోన అంగన్‌వాడీలకు వద్దకు వచ్చి అర్జీ తీసుకున్న అనంతరం పైవిధంగా వ్యాఖ్యానించారు.

  • ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి : సుబ్బరావమ్మ

రాష్ట్ర ప్రభుత్వం ఐదు దఫాలుగా అంగన్‌వాడీ వర్కర్లను అవమానపరిచే, కించపరిచే పద్ధతిలో చర్చలు చేసిందని, ఈ విధానాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ హితవు పలికారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల దీక్షా శిబిరంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన అదే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు.

 

  • సమ్మెకు వెళ్తూ వర్కర్‌ మృతి

నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయికి చెందిన అంగన్‌వాడీ వర్కర్‌ వనజమ్మ (47) బుధవారం మరణించారు. సంగంలోని సమ్మె శిబిరానికి వెళ్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుకు గురై కుప్పకూలారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో, కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక,్ష కార్యదర్శులు టివివి ప్రసాద్‌, కె.అజరుకుమార్‌ డిమాండ్‌ చేశారు.

➡️