అంగన్‌వాడీల ఆందోళన ఉధృతం

Dec 19,2023 08:38 #Anganwadi Workers, #Dharna
  • కలెక్టరేట్లు, ఆర్‌డిఒ కేంద్రాల వద్ద ధర్నా
  • సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టీకరణ

ప్రజాశక్తి- యంత్రాంగం: అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన అంగన్‌వాడీల సమ్మె సోమవారానికి ఏడో రోజుకు చేరుకుంది. రోజురోజుకూ ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది. కలెక్టరేట్లు, ఆర్‌డిఒ కార్యాలయాలు ధర్నాలో దద్దరిల్లాయి. మండల కేంద్రాలు, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద దీక్షలు సాగిస్తున్న అంగన్‌వాడీలకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. తెలంగాణలో కంటే ఎక్కువ వేతనం ఇస్తామని సిఎం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫేస్‌యాప్‌ విధానం రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, గ్రాట్యూటీ, పెన్షన్‌ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో, ఆయా కార్యాలయాల పరిసరాలు హోరెత్తాయి. సమ్మె శిబిరాలను ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు), ఎఐటియుసి, ఐఎఫ్‌టియు అనుబంధ సంఘాల నాయకులు, సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన పార్టీ, సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, ప్రజాసంఘాల నాయకులు సందర్శించి వారి పోరాటానికి మద్దతు తెలిపారు. కొన్నిచోట్ల అధికారులు సచివాలయ సిబ్బందితో అంగన్‌వాడీ కేంద్రాలను తెరిపించినా తల్లిదండ్రులు ఎవరూ తమ పిల్లలను పంపలేదు.

తిరుపతి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద భిక్షాటన చేస్తున్న అంగన్‌వాడీలు

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆర్‌డిఒను అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. ఒంగోలు ఆర్‌డిఒ కార్యాలయం వద్ద పోలీసుల పహరా ఉండడంతో రూట్‌ మార్చి ప్రకాశం భవనం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బాపట్ల కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన అంగన్‌వాడీలను పోలీసులు అడ్డగించారు. దీంతో, వారు అక్కడే బైటాయించారు. అక్కడికి బాపట్ల ఆర్‌డిఒ గంధం రవీందర్‌ వచ్చి వారి నుంచి వినతిపత్రం తీసుకున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఐటిడిఎ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. పిఒకు వినతిపత్రం ఇచ్చేందుకు లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో, గేట్‌కు ఎదురుగా అంగన్‌వాడీలు బైఠాయించడంతో ఐటిడిఎ ఎపిఒ శ్రీనివాస్‌ అక్కడికి వచ్చి మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు బద్ధలుగొట్టకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. చింతూరు ఐటిడిఎ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. ఏజెన్సీలోని అన్ని మండలాల్లో మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం కలెక్టరేట్‌ నిరసన శిబిరం నుంచి ఆర్‌డిఒ కార్యాలయానికి అంగన్‌వాడీలు ర్యాలీ వచ్చి అక్కడ బైటాయించారు. ఆర్‌డిఒ బయటకు వచ్చి తమ సమస్యలు వినాలని, అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలు కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌డిఒ ఎప్పటికీ రాకపోవడంతో కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒకటో పట్టణ సిఐ పరిస్థితిని ఆర్‌డిఒకు వివరించారు. దీంతో, మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడికి వచ్చిన ఆర్‌డిఒకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

నెల్లూరులో అంగన్‌వాడీల ర్యాలీ

భారీ ర్యాలీలు, వినూత్న నిరసనలు

అనంతపురం, పుట్టపర్తిలో అంగన్‌వాడీలు పొర్లు దండాలతో నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట మానవహారాలు నిర్వహించారు. తిరుపతి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద రోడ్డుపై భిక్షాటన చేశారు. తాము ఎందుకు సమ్మె చేస్తున్నామో అందరికీ వివరించారు. నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంతోపాటు పలు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.

బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం, ఐలవరంలో అధికారులను అడ్డుకున్న లబ్ధిదారులు

తాళాలు పగులగొట్టనీయకుండా ప్రతిఘటన

బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం లంక గ్రామాలతోపాటు మైలవరం గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించగా గ్రామస్తులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో, అధికారులు వెనుదిరిగారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెడ, చిర్రావూరు, మెల్లంపూడి, దుగ్గిరాల ఆలీనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించిన సచివాలయ అధికారులను అంగన్‌వాడీలు, స్థానికులు అడ్డుకున్నారు.

కాకినాడ ఆర్‌డిఒ కార్యాలయం వద్ద బైటాయించి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తుండడం పట్ల ఆగ్రహం

కాకినాడలో ధర్నాకు పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, సమ్మెను విరమింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏలూరులోని ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నాలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు (సిఐటియు) జి.బేబీరాణి మాట్లాడుతూ ఏడు రోజులుగా సమ్మె జరుగుతున్నా సమస్యను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు, తలుపులు బద్ధలు కొడుతూ ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముందు ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిఐటియు శ్రామిక మహిళ రాష్ట్ర నాయకులు పి.నిర్మల, ఎఐటియుసి అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి సచివాలయ సిబ్బందికి సెంటర్లను అప్పగించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల ధర్నాలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి పాల్గొని మద్దతు తెలిపారు.

బలవంతంగా తెరిచినా విశాఖ నగరంలోని రేసపువానిపాలెం అంగన్‌వాడీ కేంద్రలో సచివాలయ ఉద్యోగి తప్ప పిల్లలు కానరాని దృశ్యం
➡️