కర్నూలు జిల్లాలో మరో విషాదం

Mar 31,2024 23:17 #karnool, #road accident

-విద్యుత్‌ స్తంభాన్ని ఢకొీన్న వాహనం
-ఇద్దరు వ్యవసాయ కార్మికులు దుర్మరణం
ప్రజాశక్తి- మద్దికేర, ఆలూరు (కర్నూలు జిల్లా):కర్నూలు జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యవసాయ కార్మికులు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం… మండల కేంద్రమైన మద్దికేర గ్రామానికి చెందిన 40 మంది వ్యవసాయ కార్మికులు చిప్పగిరి గ్రామంలో మిరపకాయల కోతకు ఆదివారం వెళ్లారు. అనంతరం వారు టాటా ఏస్‌ వాహనంలో తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. కోతులమాను వద్ద ఆ వాహనం టైరు పేలింది. దీంతో, అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో వాహనం ముందు కూర్చున్న ఆదిలక్ష్మి (50), తాయమ్మ (48) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయాలైన ఐదుగురిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి, స్వల్పంగా గాయాలైన 15 మందిని గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సిపిఎం మండల కార్యదర్శి రవికుమార్‌ కోరారు.
మూడుకు చేరిన హత్తిబెళగల్‌ ప్రమాద మృతుల సంఖ్య
ఆలూరు మండలం హత్తిబెళగల్‌ బస్టాండ్‌ ఆవరణలో శనివారం ఆటో బోల్తా పడిన ఘటనలో వ్యవసాయ కార్మికురాలు మస్తానమ్మ (40) అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు వ్యవసాయ కార్మికులు ఆదివారం మరణించారు. ఆదోనిలోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హులేబీడు గ్రామానికి చెందిన దస్తగిరమ్మ (55), కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న షేకున్‌ బీ (30) వారిలో ఉన్నారు. దీంతో, మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది.

➡️