Ap : సచివాలయాల్లోనే పింఛన్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పింఛనుదారులకు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), గ్రామ, వార్డు సచివాలయ శాఖలు ఆదివారం
ఆదేశాలు జారీ చేశాయి. జిల్లా కలెక్టర్లు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు, పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మిన్‌, వెల్ఫేర్‌ సెక్రటరీలు తక్షణమే పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల ప్రకారం.. లబ్ధిదారులు ఆయా సచివాలయాలకు వారి ఆధార్‌ కార్డులు తీసుకెళ్లి, వేలిముద్ర వేసి సచివాలయం సిబ్బంది నుంచి పింఛను పొందొచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావటంతో వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీరు వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
65,92,466 మంది పింఛనుదారులు
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో అన్ని రకాల పింఛనుదారులు 65,92,466 మంది ఉన్నారు. ప్రతినెలా వీరికి ప్రభుత్వం దాదాపు రూ.1,958 కోట్లను పంపిణీ చేస్తోంది. అయితే ఒకటవ తేదికి బదులుగా 3 లేదా 4వ తేదీ నుంచి పింఛను పంపిణీ ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

➡️