ఆశాలపై నిర్బంధం 

Feb 8,2024 08:08 #arrest, #Asha Workers, #Protest
asha workers house arrest
  • అరెస్టులు, గృహనిర్బంధాలు, నోటీసులు 
  • ‘చలో విజయవాడ’ను అడ్డుకొనేందుకు పోలీసుల యత్నం 
  • యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి అరెస్టు
  • సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు హౌస్‌ అరెస్ట్‌

ప్రజాశక్తి-యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఎనిమిదిన చేపట్టిన ఆశా వర్కర్లు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం బుధవారం నుంచే నిర్బంధానికి దిగింది. పలువురు ఆశా వర్కర్లకు, యూనియన్‌ నాయకు లకు, సిఐటియు నాయకులకు పోలీసులు 149 సిఆర్‌పి నోటీసులు ఇచ్చారు. పలువురిని గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆయా పోలీస్‌ స్టేషన్లలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. కనీస వేతనం, సెలవులు, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్‌లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని, పనిభారం తగ్గిం చాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్వాన ఆశాలు ‘చలో విజయవాడ’కు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకోవడా నికి పోలీసులు రంగంలోకి దిగారు. ధనలక్ష్మి అరెస్టుఆశ వర్కర్ల యూనియన్‌ (సిఐటియు అను బంధం) ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వైద్య, కుటుంబ ఆరోగ్యశాఖ అధికారులు మంగళగిరిలోని కార్యాలయంలో చర్చల కు రావాలని కోరడంతో ధనలక్ష్మితోపాటు యూని యన్‌ అధ్యక్షురాలు ఎ పోశమ్మ, ట్రైజరీ ఎ కమలమ్మ వెళ్లారు. చర్చల అనంతరం బయటకు వస్తుండగా ధనలక్ష్మిని రాత్రి 7.30గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారు అరెస్టుల నుంచి తప్పించుకున్నారు. ధనలక్ష్మిని పోలీసులు ఎక్కడకి తరలించారనే విషయం తెలియలేదు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావును విజయవాడలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

  • సిఐటియు ఖండన

రాష్ట్రప్రభుత్వం చర్చలకు పిలిచి యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మిని అక్రమంగా అరెస్టు చేయడా న్ని సిఐటియు రాష్ట్ర కమిటీ ఖండించింది. వెంటనే విడు దల చేయాలని యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వర రావు, సిహెచ్‌ నర్సింగరావు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం తలపెట్టిన ధర్నాను నిర్వహించకుండా వందలాది ఆశ కార్యకర్తలను, సిఐటియు జిల్లా నాయకులను అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలు చేయడం సరైంది కాదని పేర్కొ న్నారు. వారందరినీ వెంటనే విడుదల చేయాలని, ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం జిల్లాలో సుమారు 40 మందిని, పార్వతీపురం జిల్లాలో 40 మందిని అరెస్టులు, గృహ నిర్బంధాలు చేశారు. పలువురికి నోటీసులు ఇచ్చారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రజాక్‌, రామ్‌నాయక్‌ లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఏలూరులో సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవికి, నగర కార్యదర్శి పి.కిషోర్‌కు, సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌తో సహా పలువురికి పోలీసులు, పలువురు ఆశాలకు సచివాలయ మహిళా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌తోసహా, జిల్లాలోని పలువురు ఆశాలకు నోటీసులు ఇచ్చి విజయవాడ వెళ్లవద్దంటూ హుకుం జారీ చేశారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం, మండపేటల్లో చలో విజయవాడకు వెళ్తున్న ఆశాలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో, పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో వారు బైఠాయించి నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. గండేపల్లిలో ఆశాలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. విజయవాడ వెళ్లేందుకు అనకాపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆశాలను పోలీసులు నిర్బంధించి స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. విశాఖలో ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ గౌరవాధ్యక్షులు పి.మణికి నోటీసులు ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో గిరిజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు హైమావతిని, పెదబయలులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సన్నిబాబును గృహ నిర్బంధం చేశారు. నులిపురుగుల నివారణ దినోత్సవం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు బాపట్ల జిల్లా భట్టిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హాజరైన ఆశాలను పోలీసులు నిర్బంధించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీనిని నిరసిస్తూ పోలీస్‌ స్టేషన్‌ వద్ద వారు ఆందోళనకు దిగారు. రేపల్లె, వేటపాలెం, వేమూరు, అమృతలూరు మండలాల్లోనూ పలువురు ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ అమృతలూరులో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆశాలు ఆందోళనకు దిగారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌ చేశారు.

➡️