అసైన్డ్‌ ఇంటి స్థలాలకు రెండు నెలల్లో భూ యాజమాన్యపు హక్కులు

Jan 7,2024 09:06 #Assigned Lands
assigned housing lands
  •  కసరత్తు ప్రారంభించిన రెవెన్యూ 
  • నిజమైన అసైనీ చేతుల్లో ఉన్న భూముల గుర్తింపు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంటి స్ధలానికి అసైన్డ్‌ పట్టా పొంది పదేళ్లు పూర్తయిన లబ్ధిదారులకు ప్రభుత్వం భూ యాజమాన్యపు హక్కులు కల్పించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయనుంది. ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి చాలా కాలమైనప్పటికీ కార్యాచరణ షెడ్యూల్‌ నిర్ధిష్టంగా ఎప్పటి లోగా పూర్తి చేయాలనే గడువు పేర్కొనక పోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈనేపథ్యంలో తాజాగా సిసిఎల్‌ఎ, ఆయా జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో రెవిన్యూశాఖ కసరత్తును ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇంటి స్ధలం పొందిన అసైనీదారుడు లేదా చట్టబద్దమైన వారి వారసులు పేరుతో రికార్డుల్లో కొనసాగుతున్న స్ధలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టారా? లేక ఖాళీ స్ధలంగానే ఉందా? భౌతికంగా నిజమైన అసైనీదారుల చేతుల్లోనే ఆయా స్ధలాలు, ఇళ్లుఉన్నాయా? లేదా అనే విషయాన్ని రెవిన్యూ అధికారులు నిర్ధారించి అర్హత జాబితాను తయారు చేసి ఆయా జిల్లా కలెక్టర్లకు పంపాల్సి ఉంటుంది. ఒక్కో గ్రామం పూర్తయిన తర్వాత మరొక గ్రామంలో ఈ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుందని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అర్హుల జాబితాను తయారు చేసేందుకు ఫార్మట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 22(ఎ) జాబితా నుంచి తొలగించడానికి జిల్లా రిజిస్ట్రార్‌కు ఇంటి స్థలాలను , జిల్లా గెజిట్‌లో జాబితాలో ప్రచురించాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో ఆర్‌డిఓ/ సభ్‌ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌కు గతంలో కేటాయించిన ఇంటి స్థలాల వివరాలు సమర్పించడానికి తహసీల్ధార్లకు ఆన్‌లైన్‌ ప్రీ హోల్డ్‌ హౌస్‌ సైట్‌ల మాడ్యూల్‌కు కూడా ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనంతరం క్షేత్రస్ధాయిలోని విఆర్‌ఓ, ఎంఆర్‌ఓలు ధృవీకరించిన జాబితాను ప్రభుత్వం ఆమోదిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • భూ యాజమాన్యపు హక్కు కల్పించడం ఇలా:

అసైనీదారుడు ఇంటి స ్థలం పట్టా పొంది పదేళ్లు పూర్తయినట్లు నిర్ధారించిన తర్వాత ఆయా గ్రామాల విఆర్‌ఓ డేటాను నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు ప్రక్రియకు సంబంధించి 15 కాలమ్స్‌తో ప్రభుత్వం ప్రొఫార్మాను ప్రభుత్వం విడుదల చేసింది. ఫార్మాట్‌లో సీరియల్‌ నెంబరు, వెబ్‌ల్యాండ్‌ ప్రకారం సర్వే నెంబరు, సర్వే నెంబర్‌ మొత్తం పరిది, భూమి ఏ రకం, భూమి వర్గీకరణ, లే అవుట్‌/వ్యక్తిగత పట్టా, లే అవుట్‌ సంఖ్య ఏదైనా ఉంటే, ప్లాట్‌ యొక్క నంబర్‌, విస్తీర్ణం, అసైనీదారుని పేరు, తండ్రి/భర్త పేరు, అసైన్‌మెంట్‌ నంబర్‌ ఏదైనా ఉంటే, వ్యక్తి అసలు అసైనీ, అసలైన అసైనీ/ చట్టపరమైన వారసుడు, స్థలం కేటాయించిన సంవత్సరం తదితర వివరాలను పార్మాట్‌లో విఆర్‌ఓ నమోదు చేయాల్సి ఉంటుంది.

  • అభ్యంతరాలకు 7 రోజులు

తహసీల్ధార్లు డేటా ఎంట్రీ , దృవీకరణ పూర్తి చేసిన అనంతరం 22(ఎ) నుంచి తొలగించడానికి అర్హత పొందిన అసైన్డ్‌ పట్టా పొందిన లబ్ధిదారుల జాబితాతోపాటు పబ్లిక్‌ నోటీసును గ్రామ /వార్డు సెక్రటరియేట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని విచారించి నిబంధనల ప్రకారం పరిష్కరించాల్సి ఉండటంతో పాటు గ్రామ సభ పెట్టి డేటా కరెక్టేనా అనే అంశాన్ని ధృవీకరించాల్సి కూడా ఉంటుందని ఫ్రభుత్వం పేర్కొంటోంది. తహసీల్ధార్లు సిఫార్సులు పూర్తి చేసిన తర్వాత ఆర్‌డిఓ /సబ్‌ కలెక్టర్‌ కేటాయించిన లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తారు. అనంతరం జాబితాను జాయింట్‌ కలెక్టర్‌కు పంపుతారు. పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్‌ తుది నిర్ణయం తీసుకుంటారు.

➡️