హిందూపురంలో దారుణం

May 12,2024 22:02 #crime, #hindupuram

– భార్య, అత్త, చిన్నత్తపై వేటకొడవలితో దాడి
ప్రజాశక్తి-హిందూపురం :భార్యను తనతో పంపకుండా అడ్డుకుంటున్నారన్న కారణంతో అత్త, చిన్నత్తపై వేటకొడవలితో అల్లుడు దాడి చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్‌ కాలనీలో శనివారం ఆర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పది సంవత్సరాల క్రితం మీనా, నవీన్‌ కుమార్‌రెడ్డిలు కులాంతర వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత మద్యానికి నవీన్‌కుమార్‌రెడ్డి బానిసయ్యాడు. భార్యతో తరుచూ గొడవపడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయారు. విడాకుల కోసం ఆమె కోర్టును ఆశ్రయించారు. తాగుడు మానేస్తానని భార్య పిల్లలను బాగా చూసుకుంటానని అత్తమామతో చెప్పడంతో కూతురిని అల్లుడితో పంపారు. నవీన్‌కుమార్‌రెడ్డి మళ్లీ మద్యానికి బానిసవ్వడంతో మీనా మళ్లీ తన పుట్టింటికి వచ్చారు. తనతో పంపకుండా అత్త కుర్మిని, చిన్నత్త రాజమ్మ అడ్డుకుంటున్నారని భావించి శనివారం అర్ధరాత్రి తన భార్య ఇంటికి నవీన్‌కుమార్‌రెడ్డి వెళ్లాడు. మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో వేట కొడవలితో భార్య, అత్త, చిన్నత్తపై నవీన్‌ దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడడంతో వారిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో స్థానికులు చేర్పించారు. రాజమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

➡️