దళిత యువకులపై దాడి

-ఇటుక రాళ్లు, గాజు సీసాలతో తెగబడిన పెత్తందారులు
-ఐదుగురికి గాయాలు
-వారిలో ఒకరి పరిస్థితి విషమం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు సావరంలో దళిత యువకులపై పెత్తందార్లు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, ఘటన జరిగి 24 గంటలు గడిచినా వార్త బయటకు పొక్కనీయకుండా చూడడం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల కథనం ప్రకారం… కడియపు సావరం గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి జాతర జరుగుతోంది. ఆదివారం రాత్రి మొదటి రోజు జాగారంలో భాగంగా గ్రామానికి చెందిన దళిత యువకులు జాతరలో పాల్గన్నారు. గతేడాది జాతర సందర్భంగా దళితులు, పెత్తందారులకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జాతరలో దళిత యువకులను లక్ష్యంగా చేసుకుని శనివారం రాత్రి 11 గంటల ప్రాంతం నుంచే పెత్తందారులకు చెందిన కొందరు యువకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పదో తరగతి విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని దళిత యువకులు అడ్డుకున్నారు. దీంతో, పెత్తందారీ యువకులు ఒక్కసారిగా ఇటుక రాళ్లు, గాజు సీసాలతో దాడికి తెగబడడంతో భయానక పరిస్థితి ఏర్పడింది. కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం నుంచి అదనపు బలగాలు కడియపు సావరం గ్రామానికి వచ్చాయి. అప్పటికే దాడిలో గాయాలపాలైన దళిత యువకులను శీలం రాజేష్‌, రేగుళ్ల కార్తీక్‌, శీలం నరసింహం, రేగుళ్ల మహేష్‌, రేగుళ్ల సురేష్‌లతోపాటు మరికొంత మంది యువకులు అత్యవసర చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి సెల్‌ఫోన్లను లాక్కున్నారు. తీవ్రంగా గాయపడిన శీలం రాజేష్‌, రేగుళ్ల కార్తీక్‌లకు వైద్యం అందించాలని పోలీసులను ప్రాధేయపడినా బాధితులను తొలుత కాలు కదపనివ్వలేదు. ఎట్టకేలకు వారిని కడియం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదనపు బలగాలతోపాటు డిఎస్‌పి స్థాయి అధికారి కడియపు సావరం గ్రామానికి చేరుకుని పూర్తి స్థాయిలో గ్రామాన్ని దిగ్బంధనం చేశారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులను గ్రామం విడిచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. తెల్లవారు జాము నాలుగు గంటల సమాయానికి పోలీసు ఉన్నతాధికారి ఒకరు కడియం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఘటనపై ఆరా తీసినట్టు సమాచారం. అనంతరం యువకులను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన శీలం రాజేష్‌ రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొంతున్నారు. బాధితులను గంటలపాటు పోలీస్‌ స్టేషన్లోనే నిర్బంధించడం, దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధాన వార్తా స్రవంతిలోగానీ, సోషల్‌ మీడియాలోగానీ రానీయకుండా పోలీసులతోపాటు, కొందరు స్థానిక రాజకీయ నాయకులు జాగ్రత్తలు పడ్డారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
గ్రామంలో ఇరు గ్రూపుల యువకులు ఘర్షణ పడడంతో కేసు నమోదు చేశాం. గ్రామానికి చెందిన బాలు, ఆది, మున్నా, సాల్మన్‌ రాజు మరికొందరు యువకులు తనపై దాడి చేశారని రాజేష్‌ వాంగ్మూలం ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిని సిసి కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా గుర్తిస్తున్నాము. వివాదానికి కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సున్నితమైన అంశం కావడంతో ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం.
ాతులసీధర్‌, కడియం సిఐ

➡️