మోడీ పాలనలో భావప్రకటనా స్వేచ్చపై దాడి

Jul 1,2024 00:15 #speech, #telakapalli ravi

– సమాజాన్ని మేల్కలిపే కథలు, కవితలు, పాటలు మరిన్ని రావాలి
– సాహిత్య ప్రస్థానం ప్రధాన సంపాదకులు తెలకపల్లి రవి
ప్రజాశక్తి – విజయవాడ :కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి చేస్తోందని సాహిత్య ప్రస్థానం ప్రధాన సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు. ఈ నేపథ్యంలో భావ ప్రకటనా స్వేచ్చను, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం మనందరిపై ఉందని తెలిపారు. మేడే -2024 సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నాలుగు సెషన్లుగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రారంభ సభకు సాహితీ స్రవంతి ప్రతినిధి వొరప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి తెలకపల్లి రవి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, ప్రముఖ మేథావి అరుంధతీరారుపై 14 ఏళ్ల నాటి కేసును నేడు తిరగదోడడమే దీనికి నిదర్శనమని తెలిపారు. అక్షరానికి కూడా సంకెళ్లు పడుతున్న తరుణంలో కవులు, రచయితలు, కళాకారులు, కళాభిమానులు, మేథావులు తమ స్వేచ్ఛను కాపాడుకుంటూనే.. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు రచనలు చేస్తూ సమాజాన్ని చైతన్యపరిచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజ్యం, పాలన, సంస్కృతి, సాహిత్యం, కళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఇవన్నీ కార్పొరేటీకరణ, కాషాయికీకరణ విష సంస్కృతి కోరల్లో చిక్కుకొని ప్రమాదంలో పడిన తరుణంలో వీటన్నింటికీ ప్రత్యమ్నాయంగా ఎంబివికె అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ఎంతో అభినందనీయమని తెలిపారు.

‘కళింగాంధ్ర కథా జాడ’ పుస్తకం ఆవిష్కరణ
అనంతరం జరిగిన కార్యక్రమంలో ‘కళింగాంధ్ర కథా జాడ’ పుస్తకాన్ని సాహితీ స్రవంతి ఉపాధ్యక్షులు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవిఎస్‌ శర్మ ఆవిష్కరించారు. సాహితీ స్రవంతి బాధ్యులు సత్యాజీ అధ్యక్షత వహించగా, ప్రముఖ కథా రచయిత, విమర్శకులు అట్టాడ అప్పలనాయుడు పుస్తకాన్ని పరిచయం చేశారు. సాహితీ స్రవంతి బాధ్యులు చీకటి దివాకర్‌ ఆత్మీయ అతిథిగా పాల్గన్నారు. ఈ సందర్భంగా ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ… ‘కళింగాంధ్ర కథా జాడ’ పుస్తకాన్ని ఎంతో అవగాహనతో తీసుకొచ్చిన అట్టాడ అప్పలనాయుడు, చీకటి దివాకర్‌లను అభినందించారు. ‘మాసిపోని మరకలు’ కథా సంకలనం పుస్తకాన్ని ప్రముఖ కథా రచయిత, విమర్శకులు అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించగా, కథా రచయిత్రి కె.ఉషారాణి పుస్తక పరిచయం చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వాల విధానాలు, దోపిడీ వర్గాల వారి శ్రమ దోపిడీ రూపాలను సులువైన భాషలో ప్రజలకు అర్ధమయ్యే రీతిలో రచనలు తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ న్యాయవాది సంపర శ్రీనివాసరావు మాట్లాడుతూ అభ్యదయ సాహిత్యాన్ని తీసుకొచ్చే దానిలో తమ సహకారం అన్ని వేళలా ఉంటుందని తెలిపారు. ‘క్షేత్రం’ కవితా సంకలనం పుస్తకాన్ని ప్రముఖ కవి, విమర్శకులు సీతారామ్‌ ఆవిష్కరించగా, ప్రముఖ కవి, విమర్శకులు సుంకర గోపాలయ్య పుస్తకాన్ని పరిచయం చేశారు. ప్రముఖ కవి అనిల్‌ డ్యాని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీతారామ్‌ మాట్లాడుతూ సమాజానికి ఏమి కావాలో అనే వివేకంతో ఆలోచించే స్థాయిలో లేమని ఆందోళన వ్యక్తం చేశారు. సాహితీ స్రవంతి ప్రతినిధి శాంతిశ్రీ మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్చపై దాడి జరుగుతోన్న ప్రస్తుత తరుణంలో మరిన్ని మంచి కథలు, కవితలు, పాటలు, ఇతర రచనలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ‘దీపం’ పాటల సంకలనం పుస్తకాన్ని పోలవరపు సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు ఆవిష్కరించగా, జాషువా సాంస్కృతిక వేదిక బాధ్యులు గుండు నారాయణరావు పుస్తకాన్ని పరిచయం చేశారు. శాంతిశ్రీ అధ్యక్షత వహించగా ప్రజానాట్యమండలి సీనియర్‌ గాయకులు జగన్‌ పలు విప్లవ గేయాలను ఆలపిస్తూ, పాట దాని పుట్టుక, సమాజంపై దాని ప్రభావంపై ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి, ప్రముఖ స్త్రీవాద కవయిత్రి మందరపు హైమావతి, అరసం నాయకులు పరుచూరి అజరు, సాహితీవేత్త డాక్టర్‌ రావెళ్ల శ్రీనివాసరావు, ప్రముఖ కవయిత్రి వైష్టవి శ్రీ, ప్రముఖ సాహితీవేత్త కుమారస్వామి తదితరులు పాల్గన్నారు. ఉత్తమ పాట, కథ, కవిత, తదితర విభాగాల్లోని మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు ముఖ్యఅతిధుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.
కథల పోటీల్లో ప్రథమ బహుమతి సయ్యద్‌ గఫూర్‌ (మాసిపోని మరకలు), ద్వితీయ బహుమతి కె.ఆనందాచారి (హిందూ సితా హమారా కథ), తృతీయ బహుమతి ఎల్‌.శాంతి (థింసాచామంతి), కవితల పోటీల్లో ప్రథమ బహుమతి డాక్టర్‌ దారల విజయకుమారి (క్షేత్రం), ద్వితీయ బహుమతి కంచరాన బుజంగరావు (మేడే జెండా కవిత), తృతీయ బహుమతి సోమిశెట్టి వేణుగోపాల్‌ (శ్రమ గొలుసు), పాటల పోటీల్లో ప్రథమ బహుమతి పావెల్‌ (మేడే దీపం), ద్వితీయ బహుమతి దుర్గా ప్రసాదరావు (నిరుపమానమైన జెండా), తృతీయ బహుమతి రావెళ్ల (లేవరా రైతన్న లేవరా) అందుకున్నారు.

➡️