3న కలెక్టరేట్ల ముందు బైఠాయింపు : అంగన్‌వాడీ సంఘాల హెచ్చరిక

Jan 2,2024 08:12 #Anganwadi strike, #subbaravamma

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: తమ సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల మూడోతేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు బైఠాయిస్తామని అంగన్‌వాడీ సంఘాల నాయకులు హెచ్చరించారు. సోమవారం ఉదయం దుర్గాపురంలోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలిత, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) రాష్ట్ర కార్యదర్శి వి.ఆర్‌.జ్యోతి మాట్లాడారు. కలెక్టరేట్ల ముట్టడిలో పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అంగన్‌వాడీలకు వారు పిలుపునిచ్చారు. 20 రోజులుగా సమ్మె జరుగుతున్నా మూడుసార్లు చర్చలు జరిపినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో అంగన్‌వాడీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపిలకు సమస్యలతో కూడిన వినతిపత్రాలు ఇచ్చారని, అయినా వారెవరూ సిఎం దగ్గర సమస్యలను ప్రస్తావించకపోడం, సెంటర్లను తాత్కాలికంగా సచివాలయ సిబ్బందికి అప్పగిస్తామని చెప్పడం తగదని తెలిపారు. చర్చలకు వెళ్లిన సమయంలో వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు చేసేదాకా సమ్మెను విరమించబోమని స్పష్టంగా తెలియజేసినప్పటికీ నేటి వరకు మంత్రుల కమిటీ సిఎం దృష్టికి తీసుకెళ్లకుండా నాన్చుతూ అవాస్తవాలు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో అయినా అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మల వేతనాలు పెంపు, గ్రాట్యుటీ వంటి అంశాలపై సిఎం ప్రకటన చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కలిసివచ్చే సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు, పార్టీలను కలుపుకుని సమ్మెను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సిఐటియు అనుబంధం అంగన్‌వాడీ సంఘం నాయకులు ఎన్‌.సి.హెచ్‌.సుప్రజ, ఎల్లారాణి, జ్యోతి, ఎఐటియుసి అనుబంధ సంఘ నాయకులు పుష్పలత, ఐఎఫ్‌టియు అనుబంధ సంఘ నాయకులు గంగావతి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్‌ 12నుండి సమ్మె చేస్తున్నా, న్యాయమైన తమ డిమాండ్లు ఇంతవరకు పరిష్కారం కాని నేపథ్యంలో, తమ సమ్మెకు మద్దతు ఇచ్చి సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని వివిధ పార్టీలను కోరుతూ రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశారు.

➡️