రానున్న 3 నెలలు అప్రమత్తం

Jun 27,2024 23:48 #Be alert, #next 3 months

– డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
-నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
– వైద్యారోగ్యశాఖ కమిషనరు వెంకటేశ్వర్‌
-రాష్ట్రంలో సురక్షితంగా లేని నీటి వనరులు 271
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:రానున్న మూడు నెలలు డయేరియా ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు వెంకటేశ్వర్‌ హెచ్చరించారు. గురువారం మంగళగిరిలోని ఎపిఐఐసి టవర్లో ఉన్న వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డయేరియా నిరంతరం పర్యవేక్షణకు డైరెక్టరు స్థాయి అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డయేరియా ప్రబలిన సమాచారం వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సురక్షితంగా లేని నీటి వనరులను తనిఖీ చేసి ధ్రువీకరించాలని వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రబలిన తరువాత హడావుడి చేయడం కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిన రోగుల వివరాలూ తీసుకోవాలని, మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి తెలపాలని ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్‌ అధికారులు నీటి పరీక్షలు సరిగ్గా చేస్తున్నదీ లేనిదీ మెడికల్‌ ఆఫీసర్లు పర్యవేక్షించాలని తెలిపారు. రాష్ట్రంలో సురక్షితంగా లేని నీటి వనరులు 271 ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వాటిని పరీక్షించి ప్రత్యామ్నాయ నీటి వనరులను అందుబాటులోకి తేవాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని వివరించారు. నీటి పరీక్షలు సక్రమంగా చేయని సిహెచ్‌ఒలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పర్యవేక్షణ లోపం ఉన్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌కూ సూచించారు. సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధి గ్రస్తులకు నెలాఖరులోపు గుర్తింపు కార్డులను సిద్ధం చేయాలని, జులై ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే స్టాప్‌ డయేరియా క్యాంపెయిన్‌కు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.
సున్నా ప్రసవాలున్న తిరుపతి, శ్రీకాకుళం జిల్లాల డిఎంహెచ్‌ఒలు పిహెచ్‌సి మెడికల్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిహెచ్‌సిల్లో ప్రసవాలు జరిగేలా గర్భిణులకు తగిన అవగాహన కల్పించడంతోపాటు వారిలో నమ్మకాన్ని కలిగించేలా మెడికల్‌ ఆఫీసర్లు తమవంతు బాధ్యత నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరు పద్మావతి, అడిషనల్‌ డైరెక్టరు అనిల్‌కుమార్‌, నేషనల్‌ హెల్త్‌మిషన్‌ స్టేట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గన్నారు.

➡️